AP Liquor Prices Increased: ఏపీలో( Andhra Pradesh) మందుబాబులకు షాక్ తగిలింది. పండుగ వేళ మద్యం ధరలు పెరగడంతో అదనపు భారం పడింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని రకాల ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రమే పెరిగాయి. ఒక్కో సీసా పై పది రూపాయలు ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరిగ్గా సంక్రాంతి వేళ ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరగనుంది. ఎమ్మార్పీ 99 రూపాయల బ్రాండ్ల ధర పెరగలేదు. వాటిని యధాతధంగా కొనసాగిస్తూ.. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రమే పెంచింది ప్రభుత్వం. సంక్రాంతి పండుగ నాడు మందుబాబులకు ఇది చేదు వార్తే.
* అన్ని ప్రీమియం బ్రాండ్లపై..
కూటమి ( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైసిపి హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాదిగా కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా తగ్గించింది. అయితే ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లపై పది రూపాయల ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మందుబాబులపై భారం పడనుంది. మరోవైపు బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో బార్లకు ఈ అదనపు పన్ను ఉండడం వల్ల.. వైన్ షాపులతో పోలిస్తే బార్లలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండేవి. అయితే ఈ ధరల వ్యత్యాసం పై బార్ల యజమానులు ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బార్ల విషయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఇంకోవైపు మద్యం రిటైల్ షాపుల యజమానులకు ఇచ్చే మార్జిన్ ను కూడా స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రిటైల్ షాపులో యజమానులకు కొంతమేర ప్రయోజనం కలగనుంది.
* ప్రభుత్వానికి పెరగనున్న ఆదాయం..
ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం సుమారు 1300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. అయితే పండుగ పూట మద్యం ధరలు పెరగడం పై మాత్రం మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వాతావరణం ప్రారంభం అయింది. మద్యం అమ్మకాలు సైతం గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.