Balakrishna: తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలివచ్చే సమయం ఆసన్నం అయ్యింది. నిన్ననే అమరావతిలో నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం అధికారికంగా షూటింగ్ ప్రారంభించుకుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. దానికి సంబంధించి ప్రారంభోత్సవం అమరావతిలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమ విస్తరణకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ చిత్రం ప్రారంభంతో మొదలైనట్టేనని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో మెజారిటీ పార్ట్ షూటింగ్ ఏపీలోనే జరిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈ సినిమా యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో మరిన్ని చిత్రాలు షూటింగ్ ఏపీలో జరిగే అవకాశం ఉంది.
* అనువైన వాతావరణం..
వాస్తవానికి సినిమా షూటింగ్లకు అనువైన వాతావరణం ఏపీలో పుష్కలంగా ఉంది. గతంలో అవుట్ డోర్ షూటింగ్ లన్ని గోదావరి జిల్లాల్లో జరిగేవి. ఏపీలో వైవిధ్యమైన లొకేషన్లు చాలా ఉన్నాయి. విశాఖలో బీచ్ పరిసర ప్రాంతాలు, అరకు లోయ, లంబసింగి కొండలు, ఉభయగోదావరి జిల్లాల పచ్చని ప్రకృతి, మారేడుమిల్లి అడవులు, గండికోట లోయలు, శ్రీశైలం పరిసర ప్రాంతాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతాల్లో తెలుగు తోపాటు అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన వెబ్ సిరీస్ ప్రాజెక్టులు షూటింగులు జరుపుకున్నాయి. సహజసిద్ధమైన అందాలు, తక్కువ ఖర్చుతో లొకేషన్లు లభించడం సినీ నిర్మాతలకు అదనపు ప్రయోజనం.
* పవన్, బాలకృష్ణ ప్రయత్నం..
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల కుటుంబాలుగా నందమూరి, కొణిదల కుటుంబాలు ఉన్నాయి. ఆ రెండు కుటుంబాలకు చెందిన పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అటువంటి నందమూరి బాలకృష్ణ అమరావతిలో తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడం మాత్రం నిజంగా శుభపరిణామం. అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ విస్తరణకు సంబంధించిన వార్తలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు అది ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నారా లోకేష్ సైతం అమరావతిలో చిత్ర పరిశ్రమ విస్తరణకు అడుగులు వేస్తుండడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. కొత్తగా నిర్మితమవుతున్న అమరావతి రాజధానిలో.. సినిమా షూటింగులకు సంబంధించి ప్రత్యేకంగా భూమి కేటాయింపు తో పాటు కొన్ని రకాల నిర్మాణాలు జరిపితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.
* భారీ ఫిలిం స్టూడియోలో ఏర్పాటు..
ఏపీ వ్యాప్తంగా సినిమా షూటింగ్లకు సంబంధించి అనేక లొకేషన్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ తరహాలో భారీ ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆధునిక ఫిలిం సిటీ, డిజిటల్ స్టూడియోలు, వి ఎఫ్ ఎక్స్ హబ్ లు, ఓటిపి కంటెంట్ ప్రొడక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఓటిపి మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ప్రొడక్షన్ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటే అమరావతి కొత్త సినీ గమ్యస్థానం గా మారే అవకాశం ఉంది.
