Anand Mahindra: మనదేశంలో ఎంతోమంది వ్యాపారులు ఉన్నారు. వారంతా కూడా లక్షల నుంచి మొదలుపెడితే వందల కోట్ల వరకు వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఇటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహీంద్రా వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. వేలాదిమంది ఉద్యోగులకు సారధి అయినప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఖాళీ సమయం దొరికితే ఏదో ఒక విషయాన్ని ట్విట్టర్లో ఆయన పంచుకుంటారు. ఆయన ట్విట్టర్లో లక్షల మంది అనుసరిస్తున్నారు.
నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని బయటపెట్టే ఆనంద్ మహీంద్రా.. తాజాగా ఒక విషయాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ఆ వీడియోలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో సీఐఐ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. వారంతా కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. అదే స్థాయిలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని.. దీనికోసం భారీగా భూములు ఉన్నాయని.. అనుమతులు కూడా ప్రభుత్వపరంగా వెంటనే వస్తాయని.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు కార్యకలాపాలు మొదలు పెట్టాలని సూచించారు. అంతేకాదు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆలస్యం జరగకుండా అన్ని వ్యవస్థలను పకడ్బందీగా రూపొందించామని చంద్రబాబు వెల్లడించారు.. ఇప్పటికే తాము వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వివిధ కంపెనీల ద్వారా పెట్టించామని.. అదే స్థాయిలో ఉపాధి కల్పనకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.. ఇతను ఏపీకి అన్ స్టాపబుల్ ఫోర్స్ అని పేర్కొన్నారు.”ఈ మనిషి ప్రకృతి ఆపలేని శక్తి. దశాబ్దాలుగా నేను ఆయనను చూస్తూనే ఉన్నాను. నిత్యం కొత్తగానే కనిపిస్తారు. ఏదో చేయాలని పరితపిస్తూనే ఉంటారు. కొత్త కొత్త విధానాలతో అభివృద్ధి అనేదాన్ని సరికొత్త దిశలో చూపిస్తారు. ఈనకంటూ సొంత సరిహద్దులు ఉన్నాయి. వాటిని ఆయన ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటారని” ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.. సాధారణంగా గొప్ప విషయాలను.. ప్రేరేపించే వ్యక్తులను మాత్రమే ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రస్తావిస్తారు. చంద్రబాబు విషయాన్ని కూడా అదే విధంగా ఆయన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.