YSR Death Anniversary : ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చవిచూసింది. ఊహించని అపజయం ఎదురయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది మాత్రం వైయస్ షర్మిల. జగన్ సోదరి ఎన్నికల్లో బలంగా పనిచేశారు. తాను గెలవడం కంటే జగన్ ఓటమి కోసం అహోరాత్రులు శ్రమించారు. కడప నుంచి తాను స్వయంగా ఎంపీగా పోటీ చేశారు. అక్కడ వైసీపీని నిలువరించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. ఎన్నికల తరువాత కూడా వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. అధికారపక్షంగా కూటమి ప్రభుత్వం ఉన్నా.. నాటి వైసిపి వైఫల్యాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకే వేదిక పైకి జగన్, షర్మిల రానున్నారు. ఉమ్మడిగా వేదిక పంచుకోనున్నారు. అందుకు కడపలోని ఇడుపాలపాయ వేదిక కానుంది. రేపు వైయస్సార్ వర్ధంతి కావడంతో కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు.
* రాజకీయంగా విభేదాలు
గత కొంతకాలంగా సోదరుడు జగన్ ను షర్మిల రాజకీయంగా విభేదిస్తున్నారు. తొలుత తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీ ఏర్పాటు చేశారు షర్మిల. కానీ అనుకున్నంత రీతిలో రాణించలేకపోయారు. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఆ పార్టీలో చేరి ఏపీలో సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. అది మొదలు ఇప్పటివరకు వైసీపీని టార్గెట్ చేశారు. అయితే ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో చేస్తున్నారన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అప్పటినుంచి సోదరుడు జగన్ తో అస్సలు వేదిక పంచుకోవడం లేదు.
* పెళ్లికి హాజరు కాని జగన్
మొన్న ఆ మధ్యన షర్మిల కుమారుడి వివాహ వేడుకలు రాజస్థాన్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో నిశ్చితార్థ వేడుకలకు జగన్ దంపతులు హాజరయ్యారు. కానీ షర్మిల తో చనువుగా ఉన్న సందర్భాలు లేవు. కనీసం పలకరింపులు కూడా లేవు. అసలు పెళ్లికి హాజరు కాలేదు. నిశ్చితార్థంలో షర్మిల ఆశించిన స్థాయిలో స్వాగతం పలకక పోవడం వల్లే జగన్ పెళ్లికి హాజరు కాలేదని ప్రచారం సాగింది. అంతకుముందు వివాహ ఆహ్వాన పత్రికలు తీసుకెళ్లిన షర్మిలకు ఆశించిన స్థాయిలో జగన్ ఆతిథ్యం ఇవ్వలేదని అప్పట్లో టాక్ నడిచింది. ఈ పరిణామాల క్రమంలో వారి మధ్య గ్యాప్ మరింత పెరగడంతో.. ఒకరంటే ఒకరు కలుసుకునే పరిస్థితుల్లో లేరు.
* ఈసారి వస్తారా
వైయస్ అకాల మరణం తరువాత.. వర్ధంతి, జయంతి సమయంలో జగన్ తో పాటు షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఇడుపాలపాయలో నివాళులు అర్పించేవారు. ఎప్పుడైతే షర్మిల సోదరుడిని రాజకీయంగా విభేదించడం ప్రారంభించారో అప్పటినుంచి కలిసి వెళ్లడం తగ్గించారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం అటు జగన్ తో, ఇటు షర్మిలతో కలిసి నివాళులు అర్పిస్తుంటారు. కానీ ఈ ఎన్నికలకు ముందు కడప ఎంపీగా పోటీ చేస్తున్న తన కుమార్తెకు మద్దతుగా ఒక వీడియో విడుదల చేశారు. ఆమెకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ జగన్ ప్రస్తావన చేయలేదు. ఆయనకు మద్దతు తెలపలేదు. దీంతో విజయమ్మ షర్మిల తో వస్తారా? జగన్ తో వస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది.