Amaravati women : అమరావతి( Amaravathi ) మహిళా రైతులను కించపరిచిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. అరెస్టుల పర్వాన్ని ప్రారంభించారు. ఇటీవల సాక్షి ఛానల్ లో ఓ డిబేట్లో అమరావతిలో వేశ్యలు ఉన్నారంటూ జర్నలిస్టు కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి మద్దతు తెలుపుతూ టీవీ యాంకర్, విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. దీనిపై పెను వివాదం నెలకొంది. అమరావతి రాజధాని ప్రాంతంలో మహిళా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు సీరియస్ అయ్యారు. సాక్షి యాజమాన్యంతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు. దీనిని వ్యవస్థీకృత కుట్రగా అభివర్ణించారు.
* అరెస్టులు ప్రారంభం..
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అరెస్టుల పర్వం ప్రారంభమైంది. మీడియా విశ్లేషకుడు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన మహిళ రైతుల ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు హైదరాబాదులోని జర్నలిస్ట్ కాలనీలో కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తీసుకురానున్నారు. మరోవైపు జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయనను ఈరోజు అరెస్టు చేసే అవకాశం ఉంది.
* స్పందించని సాక్షి మీడియా..
అయితే సాక్షి మీడియా( Sakshi media) నుంచి ఇంతవరకు దీనిపై ఖండన రాలేదు. కనీసం యాజమాన్యం స్పందించలేదు. మరోవైపు జర్నలిస్టు కృష్ణంరాజు ఈ ఘటనపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తాను అమరావతి అన్న మాట అనలేదని.. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అన్నానని.. తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించింది. వారి వ్యక్తిగత వ్యాఖ్యలతో సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదని తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారని.. అటువంటప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఇంతవరకు జర్నలిస్ట్ సంఘాలు స్పందించలేదు.
* సుదీర్ఘ నేపథ్యం..
జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ది సుదీర్ఘ నేపథ్యం. ఈనాడు( Eenadu) సంస్థల్లో పనిచేసిన ఆయన చాలా మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. గత కొద్ది రోజులుగా సాక్షి మీడియాలో విధులు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. పలు సందర్భాల్లో ఈ విషయం బయటపడింది. అయితే కొమ్మినేని విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. కూటమి విపక్షంలో ఉండేటప్పుడు వెంటాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వ్యతిరేక విశ్లేషణలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అమరావతి విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక హస్తము ఉందని అనుమానాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో