YCP party stance Amaravati issue: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం( AP assembly special session ) ఈరోజు జరిగింది. అమరావతి ఏకైక రాజధానిగా ప్రతిపాదిస్తూ ఏపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం పెట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరయింది. కూటమి ఏకపక్షంగా ఉండడంతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. పార్లమెంట్లో ఏప్రిల్ 2న అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన అంశం చర్చకు రానుంది. అయితే కేంద్రం సైతం చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధంగా ఉంది. జాతీయస్థాయిలో సైతం అమరావతి ఏకైక రాజధానికి అడ్డంకులు లేవు. అడ్డు చెప్పే పార్టీ కూడా లేదు. జాతీయస్థాయిలో పార్టీలైన బిజెపితో పాటు కాంగ్రెస్ అమరావతి రాజధాని అంశానికి ఎన్నడో మద్దతు చెప్పాయి. అదే సమయంలో ఈరోజు అమరావతి ఏకైక రాజధానిని స్వాగతిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల కీలక ప్రకటన చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
రైతులు నమ్ముతారా
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అమరావతి ఏకైక రాజధాని విషయంలో ఏ విషయం స్పష్టత చేయలేకపోతోంది.. ఇప్పుడు కొత్తగా అమరావతి రైతులకు న్యాయం పేరిట నినాదాన్ని తీసుకొచ్చింది. అమరావతి రైతులకు న్యాయం చేసిన తరువాత రాజధాని నిర్మాణం చేయాలన్న కొత్త డిమాండ్ చేస్తోంది. కానీ ఎప్పటికీ అమరావతి రైతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైన ద్వేషంతో ఉన్నారు. పైగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేక ప్రచారం చేసింది. ముంపులో రాజధాని కడుతున్నారని.. అమరావతి రాజధాని ఆమోదయోగ్యం కాదని.. దానికి నిధులు సర్దుబాటు చేయవద్దని.. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకు ఏకంగా దొంగ ఫిర్యాదులు చేసింది. ఇవన్నీ అమరావతి రైతులకు తెలుసు. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రైతులకు న్యాయం పేరిట ప్రకటనలు చేసినా.. అదే అమరావతి రైతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పరిణామాలను ఎండగట్టే అవకాశం ఉంది.
పార్లమెంటులో వైసీపీ పరిస్థితి..
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. అమరావతి ఏకైక రాజధాని చర్చకు వచ్చినప్పుడు అసలు వైసీపీ ఎంపీలు హాజరవుతారా? లేకుంటే ఏదైనా కారణాలు చెప్పి వాకౌట్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తెలిసిపోయింది. భారతీయ జనతా పార్టీ ఆది నుంచి అమరావతికి మద్దతు తెలుపుతోంది. వామపక్షాలు సైతం అమరావతికి అనుకూలంగా ఉన్నాయి. దేశంలో ఏ పార్టీ కూడా అమరావతిని వ్యతిరేకించే అవకాశం లేదు. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అయిన ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఛాన్స్ జాతీయ స్థాయి పార్టీలకు లేదు. ఎందుకంటే అడగకుండానే బిజెపికి అన్ని విధాల సహాయం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కానీ ఇండియా కూటమి విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇండియా కూటమి అవసరం అయినప్పుడు దానిని వాడుకుంటున్నారు. కానీ ఇండియా కూటమి పక్షాలు ఏదైనా సాయం కోరితే మాత్రం బిజెపి నీడలో ఉంటున్నారు. అందుకే అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో ఎదురు దెబ్బ పడటం ఖాయం.