Amaravati Green City: అమరావతికి( Amravati capital ) అన్ని హంగులు తీసుకురావాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. కేవలం రాజధాని అన్న కోణంలోనే కాకుండా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది. ఒకవైపు పాలనాపరమైన కార్యాలయాలు, ఇంకోవైపు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి అమరావతిలో. అయితే ఎక్కడైనా రాజధాని అయిన తరువాత అక్కడ కార్యాలయ భవనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు కార్యాలయాల ఏర్పాటుతోనే రాజధాని ఏర్పాటు అవుతుండడం నిజంగా గొప్ప విషయం. మొన్న అదే విషయాన్ని గుర్తు చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. ఒకేసారి 25 జాతీయ బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం అయింది. ఆ శంకుస్థాపన సందర్భంగా దేశంలో ఈ రాజధాని లో కూడా ఈ పరిస్థితి చూడలేదని ఆనందం వ్యక్తం చేశారు నిర్మల సీతారామన్. అయితే ఒక్క పాలనాపరమైన అంశాల్లోనే కాదు పర్యాటక రంగం గాను అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు చంద్రబాబు.
గ్రీనరీకి ప్రాధాన్యం..
అమరావతికి ఇప్పటి వరకు 50వేల ఎకరాల భూమిని సేకరించారు. తాజాగా మరో 20 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. దీంతో సమీకరించిన భూమి 70000 ఎకరాలకు పైగా ఉండనుంది. అయితే ఇందులో 30 శాతం పచ్చదనంతో పాటు నీటికి కేటాయించనున్నారు. తద్వారా అమరావతిని పచ్చదనంతో నింపేయనున్నారు. అందుకుగాను అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. మొన్నటికి మొన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ జరిగింది. ఈ క్రమంలో చాలా రకాల చెట్లు తొలగించారు. అలా తొలగించిన చెట్లను ఒక నర్సరీలో సాంకేతిక పరిజ్ఞానంతో బతికించారు. వాటిని రహదారులకు ఇరువైపులా నాటనున్నారు. తద్వారా పచ్చదనం పెంపొందించడమే టార్గెట్ పెట్టుకున్నారు.
రిజర్వాయర్ల నిర్మాణం..
మరోవైపు పచ్చదనం పెంచాలంటే నీరు అవసరం. అయితే అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు ప్రవహిస్తుంటాయి. ఆ నీటిని సంరక్షించి రిజర్వాయర్లలో స్థిరీకరించనున్నారు. అదే నీటిని పచ్చదనం పెంపొందించేందుకు వినియోగించనున్నారు. ముందుగా ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి పూనుకుంది ఏపీ ప్రభుత్వం. అటు తాగునీటి అవసరాలకు సైతం ఈ రిజర్వాయర్ నీటిని శుద్ధి చేయనున్నారు. కేవలం అమరావతి అనేది పాలనాపరంగా వచ్చే వారికి కాదు.. ప్రత్యేకంగా చూసే వారికి కూడా అన్నట్టు తీర్చిదిద్దనున్నారు. హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ, హైటెక్ సిటీ, షాపింగ్ మాల్స్ తిలకించేవారు ఎక్కువగా వెళుతుంటారు. ప్రత్యేక పనిపై కాకుండా కేవలం వాటిని తిలకించేందుకు సైతం వెళుతున్న వారు ఉంటారు. అటువంటి పరిస్థితి అమరావతిలో కల్పించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇది మంచి ఆలోచనని విశ్లేషకులు సైతం అభినందిస్తున్నారు.