Amaravati : ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) గుణపాఠాలు నేర్చుకున్నారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. అయినా సరే ప్రజలు గుర్తించలేదు. సంక్షేమంతో పాటు ప్రజలు అభివృద్ధిని కోరుకోవడం తోనే జగన్మోహన్ రెడ్డికి ఈ దారుణ పరాభవం ఎదురయింది. అయితే ప్రజలకు అన్నీ చేశానని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎందుకు దూరం పెట్టారో తెలియడం లేదని బాధపడ్డారు. గెలుపు అనే పిలుపుతో సంబరాలు.. ఓటమితో బాధ అనేది సహజం. కానీ ప్రజలు తిరస్కరించినప్పుడు.. దాని వెనుక ఉన్న కారణాలను అన్వేషించక తప్పదు. పోస్టుమార్టం చేసి.. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకొని.. వాటిని సరి చేసుకునే పనిలో పడాలి. మొన్నటికి మొన్న చంద్రబాబు చేసింది అదే. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి దాదాపు చంద్రబాబు పని అయిపోయిందని అంతా భావించారు. కానీ తాను ఒక్కడినే వెళ్తే బలమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడం సాధ్యం కాదని తెలుసుకున్నారు. పోయిన చోటే వెతుక్కున్నారు. భారతీయ జనతా పార్టీతో జత కట్టారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన మద్దతు పొందగలిగారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా తనకు ప్రతికూలతల తెచ్చిన అంశాల జోలికి ఆయన వెళుతుండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు.
* ప్రజల నుంచి తిరస్కరణ..
కేవలం చంద్రబాబు ( CM Chandrababu) చరిత్రలో నిలిచిపోతారని భావించి ఆయన ప్రతిపాదించిన అమరావతిని పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అది కేవలం 29 గ్రామాల సమస్య గానే చూపే ప్రయత్నం చేశారు. కానీ అది ఆంధ్రుల కలల సౌధం అమరావతి అని ప్రజలు గుర్తించారని భావించలేదు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వద్దనుకుంటే.. జనం ఆయనను వద్దనుకున్నారు. అయితే అది తెలుసుకోలేని జగన్ ఇప్పటికీ అమరావతి విషయంలో అదే వైఖరితో ఉన్నారు. తన పార్టీ నేత అంబటి రాంబాబు వంటి నేతలతో పాటు సోషల్ మీడియాలో అమరావతి పై విషం కక్కుతున్నారు. ఇంత జరిగాక.. చేదు ఫలితాలు చూశాక కూడా గుణపాఠం నేర్వకపోవడం ఏమిటనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.
Also Read : మూడేళ్లలో అమరావతి.. ఆ పనులు చేస్తేనే సాధ్యం!
* తెరపైకి కొత్త లాజిక్కులు..
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ అమరావతి విషయంలో చాలా లాజిక్కులను తెరపైకి తెస్తోంది. అసలు అమరావతి రాజధానికి పనికి రాదని పసలేని పాతవాదనను తెరపైకి తెచ్చింది. అక్కడ నిర్మాణాలు జరపడం చాలా కష్టమని చెబుతోంది. అమరావతి అనేది కృష్ణానది వరద ప్రాంతమని ప్రచారం చేస్తోంది. అలా అయితే 1500 కోట్ల రూపాయలతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నట్టు అని వాదిస్తోంది. జాతీయ రహదారులకు ఇతర ప్రాంతాల్లో తక్కువ ఖర్చు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రశ్నిస్తోంది. అయితే ఈ ప్రశ్నల పరంపరలో అమరావతి ప్రాధాన్యం పెంచేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అమరావతికి ఉచిత ప్రచారం చేస్తోంది. ప్రజలు ఇప్పటికే అమరావతి విషయంలో ఏం జరిగినా దాని వెనుక జగన్ బృందం హస్తము ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఏది చేసినా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకోవడం ఖాయం.
* ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమరావతిపై( Amaravathi ) ఎంతలా విషం కక్కాలో అంతలా కక్కారు. అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి చెల్లుబాటు అయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు.. ఆపై అమరావతి విషయంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులను సర్దుబాటు చేసింది. అయితే ఆ నిధులు రాకుండా సైతం వైసిపి బృందం ఫిర్యాదులు ఇచ్చినట్లు ప్రచారం నడిచింది. అది ప్రజా రాజధాని కాదని.. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా సరే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిని సందర్శించి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలివిడతగా నిధులు కూడా మంజూరు చేసింది. భవిష్యత్తులో అమరావతికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో ఎంత వెనక్కి తగ్గితే.. ఆ పార్టీకి అంత మంచిదన్న సూచనలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సూచనలను పాటిస్తారో? లేదో? చూడాలి.
Also Read : అమరావతి పునఃప్రారంభంతో ఆంధ్రా దశ దిశ తిరిగేనా?