https://oktelugu.com/

Nellore : పెళ్లయిన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య.. షాకింగ్ కారణం

ఆమె చనిపోయే ముందు భర్తతో ఫోన్ లో మాట్లాడినట్టు కాల్ లిస్టు చెబుతోంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అటు స్నేహితులు, కుటుంబసభ్యులను ఆరాతీస్తున్నారు. ఈ ఘటనతో చైతన్య మెడికల్ కాలేజీలో విషాదం అలుముకుంది. 

Written By:
  • Dharma
  • , Updated On : July 2, 2023 / 05:39 PM IST
    Follow us on

    Nellore : క్షణికావేశంలో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్నపాటి ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినవారికి అంతులేని విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే నెల్లూరులో వెలుగుచూసింది. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో చైతన్య అనే మెడికో బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని అఘాయిత్యానికి పాల్పడింది. దీంతో నెల్లూరులో విషాదం అలుముకుంది.

    శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య నారాయణ మెడికల్ కాలేజీలో మెడికోగా ఉన్నారు. రెండు నెలల కిందటే ఆమెకు వివాహం జరిగింది. ఇక్కడే ఆమె హాస్టల్ లో ఉంటున్నారు. ఆమె గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి మెడికోలు ఆరాతీశారు. హాస్టల్ గదిలో చూడగా ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతోంది. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో వారు చేరుకున్నారు. వేలాడున్న మృతదేహాన్ని కిందకు దించారు. ఆమె సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పలాసలోని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

    రెండు నెలల కిందటే ఆమెకు వివాహం జరిగింది. కానీ భర్తతో విభేదాలున్నట్టు తెలుస్తోంది. తరచూ భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టు పోలీస్ విచారణలో తేలింది. ఆమె చనిపోయే ముందు భర్తతో ఫోన్ లో మాట్లాడినట్టు కాల్ లిస్టు చెబుతోంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అటు స్నేహితులు, కుటుంబసభ్యులను ఆరాతీస్తున్నారు. ఈ ఘటనతో చైతన్య మెడికల్ కాలేజీలో విషాదం అలుముకుంది.