Adolescent Pregnancy: ఏపీ ( Andhra Pradesh) విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమరావతిలో మూడోసారి మంత్రులు, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే పేరిట వెలుగు చూసిన ఒక అంశం ఆందోళన కలిగిస్తోంది. అదే టీనేజీలో ప్రెగ్నెన్సీలు. వాస్తవానికి భారతదేశంలో మహిళల కనీస వయస్సు 18 ఏళ్లు. పురుషులకు 21 సంవత్సరాలు. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయసును పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఈ నిర్ణయానికి వచ్చింది. చిన్న వయసులో వివాహాల కారణంగా మహిళలు గర్భం దాలుస్తున్నారు. దీంతో మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం కనీస వివాహ వయస్సు పెంచాలంటోంది. తద్వారా టీనేజీ ప్రెగ్నెన్సీని తగ్గించాలనుకుంటుంది.
* సర్వేలో ఆసక్తికర అంశాలు..
ఏపీలో టీనేజీ ప్రెగ్నెన్సీ( teenage fragnance) ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో రోజురోజుకు టీనేజీ ప్రెగ్నెన్సీ పెరుగుతోందని.. కొన్ని జిల్లాల్లో 10 శాతానికి పైగా ఉందని తేలింది. మహిళల వివాహ వయస్సు నిబంధన 18 సంవత్సరాలు. ఆ లెక్కన 18 సంవత్సరాల కు వివాహం చేస్తే.. అక్కడకు ఏడాదికి పిల్లలు పుడతారు. అంటే 19 సంవత్సరాల కంటే తక్కువ వయసులో గర్భం దాల్చితే.. దానిని టీనేజీ ప్రెగ్నెన్సీ గా పరిగణిస్తారు. అయితే ఏపీలో 8.8% టీనేజీ ప్రెగ్నెన్సీ నమోదైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం కుప్పం నియోజకవర్గంలో టీనేజీ అమ్మాయిలు ఎక్కువగా గర్భం దాల్చుతున్నారు. అక్కడ ఆ రేటు 14.9% గా ఉంది. అయితే ఈ నియోజకవర్గం సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నది కావడం విశేషం. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అధికార యంత్రాంగం కఠిన చర్యలకు దిగుతోంది. బాల్య వివాహాలపై ఇకనుంచి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
* ఆ జిల్లాల్లో అధికం..
టీనేజీ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉన్న జిల్లాలు కర్నూలు( Kurnool ), నెల్లూరు, ప్రకాశం, అనంతపురం,బాపట్ల, పల్నాడు. ఈ జిల్లాల్లో టీనేజీ ప్రెగ్నెన్సీ 12 శాతం గా ఉంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో అయితే ఎనిమిది నుంచి 10% టీనేజీ ప్రెగ్నెన్సీ ఉంది. అయితే విశాఖ జిల్లాలో అత్యల్పంగా టీనేజీ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కేవలం 3.98% టీనేజీ ప్రెగ్నెన్సీ నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిన్ననే జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీనేజీ ప్రెగ్నెన్సీ ని నియంత్రించడం ద్వారా మాతా శిశు మరణాలను కూడా అరికట్టవచ్చని చెప్పారు. చూడాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..