ABN RK – KCR – Jagan : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు కోపం తారస్థాయికి వెళ్లినట్టు తెలుస్తోంది. సమయం వచ్చినప్పుడల్లా దాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో కొద్దొగొప్పో అణుకువ ప్రదర్శించినప్పటికీ.. ఇటీవల కాలం నుంచి నేరుగా యుద్ధం అనే సంకేతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం పలకకపోవడం, ప్రకటనలు దాదాపుగా రద్దు చేయడంతో ఆర్కే తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తన పత్రికలో ప్రతిపక్షాల కంటే తీవ్రంగా వార్తలు ప్రచురిస్తున్నారు. తాజాగా తాను రాసిన కొత్తపలుకులో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రులను విమర్శించారు.
‘కేసీఆర్ పోకడలను చూస్తే తెలంగాణలో దొరలు గుర్తుకొస్తున్నారు. ఆనాటి దొరల అరాచకాలకు వ్యతిరేకంగానే నక్సలైట్ ఉద్యమం ఊపిరిపోసుకుంది. నక్సలైట్లు బలపడ్డంతో దొరలు తోక ముడిచారు. ఇప్పుడు మళ్లీ ఆనాటి పోకడలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యవహారంగా మార్చివేశారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే గిట్టని వ్యక్తులు, మీడియా సంస్థలను కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలకు కనీసం ఆహ్వానం కూడా పంపకూడదని అధికారులను ఆదేశించడం ద్వారా కేసీఆర్ తన లేకి బుద్ధిని ప్రదర్శించుకున్నారు. అధికారులు కూడా దొర గడీలోని బానిసలుగా మారిపోయి కేసీఆర్ ఆదేశాలను తలదాల్చుతున్నారు.’ అంటూ ఆర్కే రాసుకొచ్చారు. తన సంస్థను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో రాధాకృష్ణలో ఈ కోపం సహజమే అయినప్పటికీ.. ప్రభుత్వంలో పని చేసే అధికారులు బానిసలు ఎలా అవుతారు? ఇదే ఆంధ్రజ్యో తికి రాధాకృష్ణ భాస్ కాబట్టి.. ఆయన ఆదేశిస్తే సిబ్బంది పాటిస్తారు. అది బానిస త్వం ఎలా అవుతుంది?
ఏపీ శాసనసభ కార్యక్రమాలకు హాజరు కాకుండా ఏబీఎన్ తో పాటు మరో 2 సంస్థలపై కొన్నేళ్లుగా నిషేధం విధించారు. ఏపీ సీఎం జగన్ నివాసం పరిసరాలకు కూడా ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను అనుమతించడం లేదు. సోషల్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో ఈ నిషేధాల వల్ల పాలకులకు ఏ ప్రయోజనమూ ఉండదు. అయినా వారు తమ వెకిలితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు దొరలు తమకు గిట్టనివాళ్లకు తమకు పట్టున్న ప్రాంతంలో బతుకు లేకుండా చేసేవాళ్లు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.’ అంటూ ఆర్కే రాసుకొచ్చారు. రెండు తెలుగు ప్రభుత్వాలు తనను ఏమీ చేయలేవని రాధాకృష్ణ అనుకుంటున్నప్పుడు మళ్లీ ఇలా రాయడం దేనికి? భయం లేదు అంటున్నప్పుడు ఇ సింపతీ పలుకులు దేనికీ?
‘మా రాజ్యంలో బతకాలంటే మాకు బానిసలుగా ఉండండ్రి. లేదంటే మీకు బతుకే లేకుండా చేస్తం అన్నట్టుగా కేసీఆర్, జగన్‌ల ధోరణి ఉంది. ఇలా చేయడం వల్ల లక్ష్యం నెరవేరుతుందా? కోదండరామ్‌ను కేసీఆర్ లొంగదీసుకోగలిగా రా? ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేసినంత మాత్రాన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను లొంగదీసుకోగలిగారా? మాకు మనుగడ లేకుండా చేయగలిగారా?’ అని రాధాకృష్ణా ప్రశ్నించారు. కానీ ఇదే ఆర్కే గతంలో కేసీఆర్ మీద ఇలానే యుద్ధం ప్రకటించి, అయాత చండీ యాగం సమయంలో ఒప్పందానికి రాలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేజీలకు పేజీలు వార్తలు కుమ్మేయలేదా? ఐదేళ్ల నుంచి ప్రకటనలు నిలిచిపోయాయని చెబుతున్న ఆర్కే.. అంతకు ముందు ప్రకటనలు తీసుకున్నట్టే కదా? మరి దాన్నేందుకు దాస్తున్నట్టు? తెలంగాణలో మీడియా పింక్ రంగు అద్దుకున్నది వాస్తవం. పసుపుకు గులాబీకి అతకదు కాబట్టి.. ఆర్కే దూరంగా ఉంటున్నారు. కాకపోతే టెంపర్ మెంట్ ఎక్కువ కాబట్టి కొత్త పలుకులో నిప్పులు మండిస్తున్నాడు. అయితే ఇది ఎంతకాలం అనేది మాత్రం గొట్టు ప్రశ్నే. దీనికి సమాధానం కేసీఆర్ చెప్పడు. ఆర్కే అస్సలు చెప్పలేడు.