Homeఆంధ్రప్రదేశ్‌Vangaveeti Mohana Ranga: తెలుగు నేలపై చెరగని ముద్ర 'వంగవీటి'

Vangaveeti Mohana Ranga: తెలుగు నేలపై చెరగని ముద్ర ‘వంగవీటి’

Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన్ రంగా.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఒక జాతి నాయకుడిగా ముద్రపడినా.. ఆయన బడుగు, బలహీనవర్గాలు, బహుజనులు, పేదల పెన్నిధి అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆయన భౌతికంగా దూరమై మూడున్నర దశాబ్దాలు దాటుతున్నా.. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆయనను ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నాయి.ఏపీ రాజకీయాలు ఇప్పటికీ ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. నేడు మోహన్ రంగా 76 వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

మడమ తిప్పని పౌరుషం వంగవీటి మోహన్ రంగా సొంతం. ఆత్మగౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలిచారు ఆయన. విజయవాడలో వారి రక్షణ కోసం గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగా 1988 డిసెంబర్ 26న దారుణ హత్యకు గురయ్యారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు కేవలం 41 సంవత్సరాలు. ఎంతకాలం జీవించమన్నది ముఖ్యం కాదు.. ప్రజల గుండెల్లో ఎంత స్థానం సంపాదించామన్నది ముఖ్యం. ఆయన మరణించి 35 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. చిరస్మరణీయుడిగా నిలిచారు.

కృష్ణాజిల్లా ఉయ్యూరు తాలూకాలోని కాటూరు అనే కుగ్రామంలో 1947 జూలై 4న జన్మించారు రంగా. ఆయనది ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం. వ్యాపార నిమిత్తం విజయవాడకు వచ్చింది ఆ కుటుంబం. అప్పటికే విజయవాడ విస్తరిస్తోంది. కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రంగా మారింది. తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. పీడిత వర్గాలకు అండగా నిలబడిన వంగవీటి కుటుంబంలో.. మోహన్ రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యకు గురయ్యారు. దీంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మోహన్ రంగా. జైలు నుంచి నామినేషన్ వేసి శాసన సభ్యుడిగా గెలిచిన చరిత్ర ఆయనది. తెలుగు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయానికి నాంది పలికింది. రంగా రాజకీయ ఎదుగుదలతో ఒక సామాజిక వర్గం ఎదిగి పోతుందన్న కుట్ర రాజకీయాల్లో భాగంగా.. మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. అయితే రంగాను హత్య చేయించడం అంటే ఒక వ్యక్తినో.. సమ్మోహన శక్తినో అంతమొందించడం కాదు. ఒక బలమైన సామాజిక వ్యవస్థను ఈ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి వేరు చేయడమే. అయితే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా మన మధ్య లేకపోయినా.. ఎన్నో ఆశయాలను మనకు వదిలి వెళ్లారు. కేవలం మోహన్ రంగా ను కాపు ఉద్యమ నాయకుడిగా చిత్రీకరించడం అనేది తగదు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాదీపం. అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుకునే మహనీయుడు. ఆయన రగిలించిన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం నేటి తరం పై ఉంది. మరోసారి ఆ మహనీయుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుందాం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular