Megha Brother Nagababu : తెలంగాణలో హైడ్రా పెను సంచలనాలకు కారణమవుతోంది. అక్రమంగా కట్టిన నిర్మాణాలపై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్రమార్కులు వణికిపోతున్నారు. ముఖ్యంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలను చేపట్టిన వారిపై కొరడా దులుపుతున్నారు. హైడ్రా ఏ రంగాన్ని విడిచి పెట్టడం లేదు. చివరకు సెలబ్రిటీలపై సైతం ప్రతాపం చూపుతోంది. తెలుగు హీరో నాగార్జునకు సైతం హైడ్రా షాక్ ఇచ్చింది. మాదాపూర్ లోని తుమ్మికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను నిర్మించారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పై ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ కు ఇప్పటికీ చెరువు నీరు తాకుతూ ఉంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలను సేకరించింది. చెరువులో మూడు ఎకరాల 30 గుంటలను ఆక్రమించి నిర్మించారని హైడ్రా గుర్తించింది. అక్రమ కట్టడం గా నిర్ధారించి కూల్చివేయడం జరిగింది. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
* కామెంట్స్ వైరల్
అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో హైడ్రాపై నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైడ్రాను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్విట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. నగరాల్లో వర్షాలకు తూములు తెగిపోయి, నాళాలు, చెరువులు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి వరద నీరు చొచ్చుకొస్తోంది. ప్రజల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటన్నింటికీ చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే కారణం అంటూ ట్విట్ చేశారు. వీటిని నియంత్రించేందుకు సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రాక్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలని ట్విట్ చేశారు.
* అక్కినేని అభిమానుల రియాక్షన్
ఒకవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో రకరకాల ప్రచారం జరుగుతోంది. అక్కినేని అభిమానులు రేవంత్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు నాగార్జున సైతం న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. రేవంత్ పై ఆగ్రహంగా ఉన్న వేళ.. నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించడం.. సీఎం రేవంత్ రెడ్డి ని అభినందించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అక్కినేని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
* మెగా బ్రదర్ ఎంట్రీ వెనుక
వాస్తవానికి నాగబాబు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి మాత్రమే కాదు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన జనసేనకు ప్రధాన కార్యదర్శి. ఆయన సినిమా మనిషి కంటే రాజకీయ నేతగానే ఎక్కువమంది చూస్తారు. సినీ రంగం పరంగా అక్కినేని, మెగా కుటుంబాలకు మంచి అనుబంధమే ఉంది.కానీ జగన్ కు నాగార్జున సన్నిహితుడు అన్న ప్రచారం ఉంది. చంద్రబాబు, బాలకృష్ణతో అంత సంబంధాలు ఉండవు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడానికి ఏపీ రాజకీయాలే కారణమన్న ప్రచారం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నాగబాబు కూల్చివేతను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More