Rare mineral discovered in AP: రాయలసీమను( Rayalaseema ) రతనాలసీమ గా పేర్కొంటారు. ఖనిజ సంపదకు పెట్టింది పేరు కూడా. అందుకే ఖనిజాల కాణాచి అంటారు. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఖనిజ నిక్షేపాలు అధికం. రాయలసీమలో దొరికే ఖనిజ నిక్షేపాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని.. ఇది అత్యంత విలువ చేసే గని అని అమెరికా పరిశోధనల్లో తేలినట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని మంగంపేట బెరైటీస్ గనుల్లో అరుదైన పుల్లరిన్ ఖనిజా నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలినట్లు సమాచారం. నానో టెక్నాలజీకి కీలకమైన పుల్లరిన్ వెలికి తీస్తే దేశ భవిష్యత్తే మారిపోతుంది. ప్రస్తుతం దీనిపైనే పెద్ద చర్చ నడుస్తోంది.
18 సంవత్సరాల కిందట..
సుమారు 18 సంవత్సరాల కిందట మంగంపేట( mangampeta ) గనుల్లో భారీగా పుల్లరిన్ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటినుంచి లోతైన అధ్యయనం కొనసాగుతోంది. పుల్లరిన్ అనేది కార్బన్ మిళితమైన ఓ పదార్థం. గోళ, స్థూపాకార ఆకృతుల్లో ఉండే ఖనిజం. అయితే ఇది ఉక్కు కంటే దృఢత్వంలో 2005 రెట్లు ఎక్కువ. పది రెట్లు తేలికైంది కూడా. అందుకే అమెరికా లోతైన పరిశోధనలు చేపట్టింది. మిగతా దేశాలు సైతం ఇప్పుడు అదే పనిలో ఉన్నాయి. మంగంపేట బెరైటీస్ గని పరిసరాల్లో మొత్తం 156 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నమూనాలు సేకరించి పరీక్షించారు. భువనేశ్వర్ లోని ఐఎంఎంటీ బృందం సైతం ఇక్కడ నమూనాలను సేకరించింది. కానీ తరువాత ఎందుకో సైలెంట్ అయింది.
ఎన్నో ప్రత్యేకతలు..
పుల్లరిన్(Pullarin) అనేది ప్రత్యేక ఖనిజం. ఎన్నో రకాల ప్రయోజనాలు దీని సొంతం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, పిడుగుపాటు నుంచి రక్షణకు విమానాలకు పైపూతగా దీనిని వాడుతారు. క్షిపణులకు ఈ పూత రాస్తే రాడార్లు కూడా పసిగట్టలేవు. ప్రధానంగా ఇంధన వాహకాల తయారీలో ఈ ఖనిజాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్, సోలార్ ఎనర్జీ టెక్నాలజీ పరంగాను దీనిని వాడుతారు. ఇంతటి ఈ ఖనిజంపై అమెరికా సీరియస్ గా పరిశోధనలు చేస్తోంది. సక్సెస్ అయితే ఈ ఖనిజం నిజంగా బంగారమే. ఈ దేశ తలరాతనే మార్చేస్తుంది.