https://oktelugu.com/

Free Education : 71 వేల సీట్లు మిగిలిపోయాయి.. ఇది ఎవరి నిర్లక్ష్యం?

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టాన్ని గత విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. 2022–23 విద్యాసంవత్సరంలో కేవలం 3 శాతం సీట్లు మాత్రమే భర్తీ చేశారు. అంటే 4 వేల మందికి మాత్రమే ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత ప్రవేశం లభించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 16, 2023 / 04:53 PM IST
    Follow us on

    Free Education : పాలకులు చట్టాలు చేయగానే సరిపోదు.. వాటి అమలుపైనా దృష్టిపెట్టాలి. కఠినంగా అమలు చేయించాలని. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులదే. కానీ చట్టాలు చేయడంపై ఉన్న శ్రద్ధ.. వాటి అమలుపై పెట్టడం లేదు. దీంతో అనేక చట్టాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. తాజాగా విద్యాహక్కు చట్టం పరిస్థితి అంతే. పాలకుల నిర్లక్ష్యం, అధికారులు అవగాహన కల్పించకపోవడం, ఆ హక్కు ఉందనే విషయం ప్రజలకు తెలియకపోవడం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో 71 వేల సీట్లు మిగిలిపోయాయి. అంటే 71 వేల మంది పిల్లలు ఆ హక్కుకు దూరమయ్యారన్నమాట.

    2009లో చట్టం.. 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమలు.. 
    విద్యాహక్కు చట్టాన్ని 2009లోనే అప్పటి యూపీయే ప్రభుత్వం రూపొందించింది. 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ చట్టం అమలు కావడం లేదు. చట్టాన్ని అమలు చేయకుండా విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. పాలకులు కూడా ఈ ఒత్తిడికి తలొగ్గుతున్నారు. పేదలను విద్యాహక్కుకు దూరం చేస్తున్నారు.
     ప్రజలు కూడా అంతే.. 
    సామాజిక స్పృహ ఉన్న మేధావులు విద్యావేత్తలు, విద్యార్థి తల్లిదండ్రులు విద్యాహక్కు కోసం నినదిస్తూనే ఉన్నా ..
    ఎవరో ఇచ్చే పువ్వుకో, పండుకో, తైలంకో అలవాటు పడ్డ విద్యార్థి తల్లిదండ్రుల తమ బిడ్డల భవిష్యత్తును, విద్యాహక్కు ఆవశ్యకతను విస్మరిస్తున్నారు. రాజకీయ మైలేజీకి మాత్రమే పరిమితం అవుతున్న ప్రభుత్వలు రాజకీయ పార్టీలు భారీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఈ చట్టం అమలు చేయాలని గట్టిగా అడిగే రాజకీయ పార్టీలు, నేతలు కూడా లేకపోవడం గమనార్హం.
    అవగాహన కూడా కల్పించని వైనం.. 
    విద్యా హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని చట్టం చెబుతున్నా.. ఎక్కడ ప్రచారం కనిపించడం లేదు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. దీంతో విద్యాహక్కు చట్టం ఉందన్న విషయం కూడా చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదు.

    71 వేల సీట్లు మిగులు.. 

    విద్యాహక్కు చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలల్లో 90 వేల సీట్లు ఉన్నాయి. ఏటా ఒకటో తరగతిలో వీటిని భర్తీ చేయాలి. కానీ ఆర్థికంగా నష్టపోతామని ప్రైవేటు పాఠశాలలు వాటి ఊసే ఎత్తడం లేదు. చట్టం గురించి తెలియని తల్లిదండ్రులు యాజమాన్యాలను అడగడం లేదు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది 90 వేల సీట్లలో కేవలం 18,749 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 71 వేలు మిగిలి పోయాయి. అంటే 71 వేల మంది హక్కును సద్వినియోగం చేసుకోలేదు.
    గత విద్యా సంవత్సరం నుంచే అమలు.. 
    ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టాన్ని గత విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. 2022–23 విద్యాసంవత్సరంలో కేవలం 3 శాతం సీట్లు మాత్రమే భర్తీ చేశారు. అంటే 4 వేల మందికి మాత్రమే ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత ప్రవేశం లభించింది. ఈ ఏడాది పరిస్థితి కాస్త మెరుగు పడింది. 45,372 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 27,648 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకోగా, 26,279 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 18,749 మందికి సీట్లు దక్కాయి. ఇంకా 71 వేల సీట్లు మిగిలిపోయాయి.
    తల్లిదండ్రులు కోరినా..  
    విద్యాహక్కు చట్టంపై విస్తృత ప్రచారం చేయాలని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలనిచ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితంగా ఆన్లైన్‌ అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహించాలని, ప్రతీ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు చట్టం అమలు చేస్తామని నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని పేరెంట్స్‌ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఆదిశగా ఒక్క పని కూడా విద్యాశాఖ చేపట్టలేదు.