108 vehicles New Look: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా 108 అంబులెన్స్ వాహనాలకు కొత్త రూపు తీసుకురానుంది. వైసిపి ప్రభుత్వం 108 వాహనాలకు ఉన్న రంగును మార్చింది. నీలిరంగులోకి మార్చేసింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం 108 అంబులెన్స్లను సరికొత్త పరిజ్ఞానంతో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త అంబులెన్స్లను అందించనుంది. ఈ వాహనాలు తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో ఇకనుంచి కనిపించనున్నాయి. వాటికి రాత్రి వేళల్లో కూడా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు కూడా ఉంటాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో అంబులెన్స్ల ఆధునికరణ పనులు పూర్తి చేశారు. 108 అంబులెన్స్ సేవలు మరింత మెరుగుపడేలా ఏర్పాట్లు చేసింది కూటమి ప్రభుత్వం. ఇలా రంగులు మార్చిన 108 వాహనాలు జిల్లాలకు చేరాయి కూడా.
* మెరుగైన సేవలందేలా
రోగులతో పాటు క్షతగాత్రులకు సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు అందించాలన్న భావనతోనే.. 108 వాహనాల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కూడా కల్పించారు ఈ అంబులెన్స్ లలో. కొత్తగా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ విధానం సైతం అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర చికిత్స అందించే వెసులుబాటు కల్పించారు. వన్ జీరో ఎయిట్ వాహనంలోనే రోగికి వెంటిలేటర్ పై ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. ఒకే సమయంలో ముగ్గురు రోగులను రక్షించే ఏర్పాట్లు కూడా జరిగాయి. అలా అన్ని రకాల సేవలు ఆ వాహనాల్లో ఉన్నాయి.
* అన్ని రకాల జాగ్రత్తలు..
వాస్తవానికి చాలా జిల్లాల్లో 108 వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. అందుబాటులో లేకుండా పోయాయి. అటువంటి వాటికి విడతల వారీగా మరమ్మత్తులు చేస్తున్నారు. తరువాత అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇలా మరమ్మత్తులు పూర్తయిన వాటిని జిల్లాలకు పంపిస్తున్నారు. అయితే కాలం చెల్లిన వాహనాల విషయంలో మాత్రం వెనక్కి తీసుకొచ్చారు. 108 వాహనాలు నడిపే డ్రైవర్లు మద్యం తాగి విధులకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారికి బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు చేస్తున్నారు. ఇకనుంచి 108 వాహనాలపై రాజకీయ నేతల ఫోటోలు లేకుండా నిషేధించారు. కేవలం రాజముద్ర మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా.. వాటికి సంజీవిని అని పేరు పెట్టారు.