White Snakes: కొన్ని నిర్మాణ పనులు జరిగేటప్పుడు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎన్నో రకాల జీవరాశులు నష్టపోతుంటాయి. అలాగే ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనుల సందర్భంగా పురాతన ఆలయ శిలలను తొలగించే క్రమంలో వాటి కింద నుంచి మూడు శ్వేతనాగులు బయటకు వచ్చాయి. అయితే ఈ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనను గ్రామస్తులు ఒక దైవ హెచ్చరికగా భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే?
ములుగు జిల్లాలోని సమ్మక్క–సారక్క గిరిజన విశ్వవిద్యాలయం చుట్టూ భద్రతా దృష్ట్యా రూ.24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల పొడవున భారీ ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తి చేసింది. అయితే పనులు మొదలైనప్పటి నుంచే భూమి తవ్వకాలలో అనేక చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. పురాతన శిల్పకళతో కూడిన రాతి స్తంభాలు, దేవతా విగ్రహాల ముక్కలు, ఆలయ నిర్మాణాలకు ఉపయోగించే రాతి బండలు బయటపడటంతో ఈ ప్రాంతం ఒకప్పుడు కాకతీయుల కాలం నాటి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే క్రమంలో తాజాగా ఎక్స్ కావేటర్ తో కందకం తవ్వుతున్న సమయంలో భారీ రాతి శిలలు అడ్డుగా రావడంతో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. మొదట సాధారణ రాళ్లేనని భావించిన ఆపరేటర్, వాటిని కదిలించగానే అవి పురాతన ఆలయ శిలలని అక్కడి సిబ్బందికి అర్థమైంది. ఇదే సమయంలో ఆ శిలల కిందనుండి ఒక్కసారిగా మూడు తెల్లని నాగుపాములు పడగవిప్పి బయటకు రావడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఊహించని ఈ ఘటనతో కార్మికులు, అధికారులు భయంతో పరుగులు తీశారు.
అయితే శిలలను తొలగించే సమయంలో ఎక్స్ కావేటర్ బకెట్ ఒక నాగుపాముకు తగలడంతో అది అక్కడికక్కడే చనిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మిగిలిన రెండు నాగులు బుసలు కొడుతూ జేసీబీ చుట్టూ తిరిగినట్లు సమాచారం. పాముల ఆగ్రహరూపం చూసిన డ్రైవర్ తీవ్ర భయానికి గురై అక్కడి నుంచి పరుగులు తీశాడని చెబుతున్నారు. కొంతసేపటి వరకు ఆ ప్రాంతంలో ఎవరూ అడుగుపెట్టేందుకు కూడా సాహసించలేదని స్థానికులు వెల్లడించారు.
ఈ ఘటన తర్వాత పరిస్థితి మరింత మిస్టరీగా మారింది. కొంతసేపటి అనంతరం ధైర్యం తెచ్చుకున్న ఎక్స్ కావేటర్ ఆపరేటర్ తిరిగి వచ్చి వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా, అప్పటివరకు సజావుగా పనిచేసిన యంత్రం ఒక్కసారిగా మొరాయించిందట. పలుమార్లు ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇది సాధారణ విషయం కాదు.. అక్కడ దైవిక శక్తి ఉంది అనే ప్రచారం చుట్టుపక్కల గ్రామాల్లో వేగంగా వ్యాపించింది.
స్థానిక గిరిజనులు, పెద్దలు ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా పేర్కొంటున్నారు. పురాతన ఆలయ అవశేషాలను ధ్వంసం చేయడమే ఈ పరిణామాలకు కారణమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. నాగులు ప్రత్యక్షమవడం, యంత్రం పనిచేయకపోవడం వంటి పరిణామాలు దేవతల ఆగ్రహానికి సంకేతమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వెంటనే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, పురాతన శిలలను సంరక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక చరిత్ర పరిశోధకులు మాత్రం ఈ ఘటన మరో కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిందని చెబుతున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటనాస్థలానికి సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని శ్వేతనాగులు కనిపించిన ప్రదేశాన్ని దర్శించుకుంటున్నారు. కొందరు అక్కడ పాలు పోసి నాగదేవతలకు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన కథనాలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.