Royal Enfield Global Ranking: Royan Enfield మరోసారి భారత ఆటోమోబైల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చింది. బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ 2026 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ఆటోమోబైల్ బ్రాండ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టయోటా, BMW తర్వాత నిలిచిన ఈ భారతీయ బ్రాండ్, ఆడీ, ఫెరారీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను వెనక్కి నెట్టడం విశేషం. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ 2026 నివేదిక వివరాల ప్రకారం.. టయోటా (92.5) మొదటి స్థానంలో నిలవగా.. BMW(88.9) రెండో స్థానంలో నిలిచింది. రాయల్ ఎన్ఫీల్డ్ 100లో 88.9 బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోరు సాధించి AAA రేటింగ్ పొందింది. అదే సమయంలో బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీకి ఉన్న ప్రత్యేకమైన మోటార్‌సైకిల్ గుర్తింపు, ప్రీమియం లైఫ్‌స్టైల్ బ్రాండ్ ఇమేజ్, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ ఎదుగుదల వెనుక గ్లోబల్ విస్తరణ కూడా కీలక పాత్ర పోషించింది. కొత్త మోడళ్లు, క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక టెక్నాలజీ జోడించడం, దేశీయంగానే కాక విదేశీ మార్కెట్లలోనూ అమ్మకాలు పెరగడం బ్రాండ్ బలం పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు పెరుగుతున్న గుర్తింపు, వినియోగదారుల్లో ఏర్పడిన నమ్మకం దీనిని సాధారణ ద్విచక్ర వాహన కంపెనీ స్థాయిని దాటి గ్లోబల్ ఆటో బ్రాండ్‌గా నిలిపాయి.
ఈ నివేదికలో ఇతర భారతీయ ఆటో బ్రాండ్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. టాటా మోటార్స్ ప్రపంచంలో ఐదో అత్యంత శక్తిమంతమైన ఆటో బ్రాండ్‌గా నిలిచి 88.1 BSI స్కోరు నమోదు చేసింది. మారుతీ సుజుకీ 87.2 స్కోరుతో ప్రపంచంలో ఆరవ అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా నిలిచింది. మహీంద్రా కూడా గ్లోబల్ స్థాయిలో బలమైన స్థానం సంపాదించింది. మహీంద్రా బ్రాండ్ విలువ 17 శాతం పెరిగి 3.8 బిలియన్ డాలర్లకు చేరగా, ప్రపంచ అత్యంత విలువైన ఆటో బ్రాండ్లలో 25వ స్థానాన్ని దక్కించుకుంది. దీని ద్వారా భారత ఆటో రంగం కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, ప్రపంచ బ్రాండ్ పోటీలో గట్టిగా నిలుస్తోందని స్పష్టమైంది.