Vijayawada YCP: ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో విజయవాడ లోక్సభ స్థానం హాట్ టాపిక్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. నవ్యాంధ్రప్రదేశ్ లోనైనా ఈ స్థానం ప్రత్యేకమే. రాష్ట్రం నడిబొడ్డున ఉండే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపంలో నిరూపితమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత మూడు ఎన్నికలు జరిగాయి. కానీ ఒక్కసారి మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండుసార్లు టిడిపి విజయం సాధించింది. అయితే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం సెంటిమెంటును బ్రేక్ చేస్తూ తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది.
ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. జరగబోయేది మరో ఎత్తు అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి గెలవాలని భావిస్తోంది ఆ పార్టీ. అందుకే ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కేసినేని చిన్ని ఉన్నారు. 2014, 2019లో గెలిచిన కేశినేని నయ నాని చివరి నిమిషంలో టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా మారిపోయారు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సొంత సోదరుడు చిన్ని గెలిచారు. అయితే హ్యాట్రిక్ విజయంతో విజయవాడ పార్లమెంట్ స్థానం వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది. అందుకే దానిని కైవసం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు.
2029 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సీటు గెలవాలన్నది జగన్మోహన్ రెడ్డి టాస్క్. అందుకే ఆ బాధ్యతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలకు అప్పగించారు. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ సీటు పరిధిలో కమ్మ సామాజిక వర్గం అధికం. దశాబ్దాల కాలంగా ఈ పార్లమెంటు సీటులో కమ్మ సామాజిక వర్గం వారే గెలవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈసారి కేశినేని నానితో పాటు మరో యువనేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ నాని వద్దనుకుంటే మాత్రం ఆ యువనేత రంగంలోకి దిగడం ఖాయంగా తెలుస్తోంది.
2014లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు కేశినేని నాని. అప్పటివరకు వ్యాపారవేత్తగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే ఇదే కేశినేని నాని 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సొంత సామాజిక వర్గం కావడంతో గుర్తించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి రప్పించి టికెట్ ఇచ్చారు. అలా రెండుసార్లు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే లోకల్ పాలిటిక్స్ కు మూలంగా ఆయన టిడిపికి దూరమయ్యారు. ఆయన స్థానంలో తమ్ముడు చిన్ని టిడిపిలో చోటు దక్కించుకున్నారు. అలా అన్నపై పోటీ చేసి ఎంపి అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నియోజకవర్గం నుంచి యువనేత దేవినేని అవినాష్ ను పోటీ చేయించాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం పై ఫాకస్ పెట్టారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అవినాష్ ను విజయవాడ నుంచి పోటీ చేయించాలని ఆలోచనకు వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేసినేని నాని, లేకుంటే దేవినేని అవినాష్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ టిడిపి కూటమి బలంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.