Hijra Blessings: ఇటీవల ఒక వ్యక్తి గృహప్రవేశం చేసే సమయంలో హిజ్రాలు వచ్చి డబ్బులు అడిగారని.. ఇవ్వకపోతే దాడి చేశారని ఆ వ్యక్తి ఆరోపించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే వాస్తవానికి ఏవైనా శుభకార్యాలు నిర్వహించేటప్పుడు ప్రస్తుత కాలంలో హిజ్రాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వారితోనే కార్యాలను ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా వారి నుంచి దీవెనలను తీసుకుంటున్నారు. మిగతా వారి కంటే హిజ్రాల దీవెన ఎంతో ఉత్తమమైనదని కొందరు భావిస్తుంటారు. పుట్టిన బిడ్డ నుంచి పెళ్లి అయినా కొత్త దంపతులు, కొత్త ఇల్లు వంటి శుభకార్యాలు నిర్వహించినప్పుడు వీరి దీవెన ఎంతో శుభప్రదం అని అనుకుంటారు. అయితే వీరి దీవెన ఇంత ఉత్తమమైనది కావడానికి కారణం ఏంటి? అందుకు గల పురాణ కథ ఏదైనా ఉందా?
సమాజంలో స్త్రీలు, పురుషులు అనే రెండు లింగ భేదాలు కాకుండా మరో రకమైన వారిని హిజ్రాలు అని పిలుస్తుంటారు. వీరి ప్రవర్తన సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే అనుకోకుండా వారి శరీరంలో జరిగిన మార్పుల తోనే వారు ప్రత్యేకంగా మారుతారు. సాధారణ వ్యక్తుల్లో మంచివారు, చెడ్డవారు ఉన్నట్లే.. హిజ్రాల్లో కూడా మంచివారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారు మనస్ఫూర్తిగా దీవిస్తే వారు ఎంతో ఉన్నత స్థితికి చేరుతారని భావిస్తారు. అందుకే వారు ఎక్కడ కలిసినా వారితో దీవెనలను అందుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే హిజ్రాల దీవెన వెనుక ఒక పురాణ కథ ఉంది. దీని ఆధారంగానే హిజ్రాల దీవెన ఎంతో ఉత్తమమైనది అని భావిస్తున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే?
రామాయణంలో రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం వెళ్లిన విషయం తెలిసిందే. రాముడు అడవికి వెళ్లేటప్పుడు అతనితో ఊరు ప్రజలు వెంట వెళ్తారు. వీరిలో హిజ్రాలు కూడా ఉంటారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత రాముడు వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమని చెబుతాడు. వీరిలో కొంతమంది తిరిగి వెళ్తారు. కానీ హిజ్రాలు మాత్రం రాముడు తిరిగి వచ్చేవరకు అక్కడే కాలం గడుపుతారు. అలా రాముడు తిరిగి వచ్చేసరికి అక్కడే ఉన్న హిజ్రాల భక్తిని చూసి ఎంతో మెచ్చుకుంటాడు. దీంతో వారికి ఒక దీవెనలు ఇస్తాడు. మీరు ఎంతో ఉత్తమమైన భక్తితో కలిగి ఉన్నారు.. అందువల్ల మీ దీవెనలు ఎంతో శుభప్రదంగా ఉంటాయని వరం ఇచ్చాడని పురాణాల్లో చెప్పబడింది.
అలా హిజ్రాలు ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటే తప్పకుండా జరుగుతుందని అంటూ ఉంటారు. అయితే హిజ్రాల గురించి చరిత్ర పుటల్లో కూడా ఉంది. మొగల్ సామ్రాజ్యంలో హిజ్రాలు రక్షకులుగా ఉండేవారు. వీరికి కొన్ని ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసేవారు. రాజ కుటుంబానికి సంబంధించిన పిల్లలను బాగా చూసుకునే బాధ్యతను రాజులు వీరికి అప్పగించేవారు. అలాగే ప్రసవం తర్వాత తల్లులు, పిల్లలను రక్షించడం.. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వల్ల వీరికి గుర్తింపు వచ్చింది. అయితే హిజ్రాలు మంచి మనసుతో దీవిస్తే శుభం జరుగుతుంది.. కానీ వారు చెడు దృష్టితో చూస్తే తీవ్రమైన నష్టం జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.