Time Bank Scheme: డబ్బు కంటే సమయం విలువైనది.. అని కొందరు చెబుతూ ఉంటారు. ఈ సమయం అనేది డబ్బు సంపాదించడం కోసం వినియోగించాలని మరికొందరు చెబుతారు. అయితే కేవలం డబ్బు కోసం కాకుండా ఈ సమయాన్ని సేవా కోసం కూడా ఉపయోగిస్తే కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. అంటే మీకు ఉన్న సమయాన్ని ఇతరులకు సేవ చేయడం వల్ల వారి అవసరాలు తీరడంతో పాటు మీకు కొన్ని క్రెడిట్ వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా జరపడానికి కేరళలో ‘ టైం బ్యాంక్ ‘ ను ఏర్పాటు చేశారు. సాధారణంగా డబ్బులు ఉండే బ్యాంకు ఉంటుంది.. రక్తం ఉండే బ్లడ్ బ్యాంకు ఉంటుంది.. కానీ ఈ టైం బ్యాంకు ఏంటి? దీనిని ఎవరు స్థాపించారు?
టైం బ్యాంక్ అనేది సాధారణంగా సహకార వ్యవస్థ లాంటిది. అంటే ఇందులో ఎవరైతే తమ సమయాన్ని సేవకు ఉపయోగించుకుంటున్నారో వారు రిజిస్టర్ కావచ్చు. విద్యార్థులు, మహిళా సంఘాలు, వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇందులో రిజిస్టర్ అయి కొందరికి సేవా చేయవచ్చు. ప్రస్తుత కాలంలో చాలామంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. కొంతమందికి ఎంతోమంది కుమారులు, కుమార్తెలు ఉన్నా కూడా వారిని పట్టించుకోరు. ఇలాంటి వారికి మెడిసిన్స్, వెజిటేబుల్స్ లేదా ఇతర అవసరాలు తీర్చడానికి ప్రత్యేకంగా మనుషులు అంటూ ఎవరూ ఉండరు. ఇలాంటి వారికి సేవ చేయడానికి ఏర్పాటు చేసిందే ఈ టైం బ్యాంక్. ఈ టైం బ్యాంకులో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరికి అయితే సేవ అవసరం ఉంటుందో వారి వద్దకు వెళ్లి వారి అవసరాలను తీరుస్తారు. అలాగే ఎవరైతే తమకు సేవ చేయడానికి వ్యక్తులు కావాలో వారు వెబ్సైట్ ద్వారా సమాచారం అందించవచ్చు. ఇలా ఒకరికొకరు కలుసుకోనడానికి టైం బ్యాంకు డిజిటల్ యాప్ ఉంటుంది. లేదా వెబ్సైట్ ద్వారా వీరు కలుసుకోవచ్చు.
అయితే టైం బ్యాంకులో రిజిస్టర్ అయిన వాళ్ళు సేవ చేయడానికి కొన్ని ప్రతిఫలాలు ఉంటాయి. వీరికి కొన్ని క్రెడిట్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ పాయింట్స్ ఆధారంగా వారికి భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే ఇవి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఉద్యోగం లేదా ప్రభుత్వానికి సంబంధించిన దరఖాస్తు ఉంటే అందులో ఈ క్రెడిట్ పాయింట్స్ తో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృద్ధులకు సైతం తమ అవసరాలు తీర్చడానికి వీరు ఎంతగానో ఉపయోగపడతారు.
టైం బ్యాంకు ను కేరళలోని స్టేట్ సోషల్ సెక్యూరిటీ మిషన్ ఆధ్వర్యంలో కొచ్చి, త్రిశూర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, శారీరకంగా బలహీనులు అయిన వారు తమకు కావాల్సిన సేవలను వెబ్సైట్ ద్వారా పొందారు. ఈ రెండు జిల్లాల్లో విజయవంతం అయిన తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లోనూ టైం బ్యాంక్ పై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది వృద్ధులు అనేక మానసిక ఇబ్బందులు పడుతున్నారు. వారితో కాసేపు మాట్లాడడానికి సైతం ఇతరుల సేవలను కోరుతున్నారు. దీంతో సామాజికంగా వృద్ధులు, ఆర్థికంగా వాలంటీర్లు ఇరువురికి ప్రయోజనాలు చేకూరి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.