Animals Vs Humans: ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు ఏదో ఒక రకంగా ప్రాణం ఉంటుందని కొందరు చెబుతారు. అయితే మిగతా వాటికంటే జంతువులు, పక్షులు, క్షీరదాలు, కీటకాలు మనుషుల జీవితాలకు సంబంధించిన లక్షణాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే మనిషి ప్రాణం పోయినట్టే అవికూడా ప్రాణం పోతే బతకలేవు. కానీ పక్షులు, జంతువుల కంటే మనుషులు ఎంతో ఎదిగారని చెప్పుకోవచ్చు. మనిషిలో మెదడు అనే అవయం ద్వారా ఆలోచన శక్తిని పెంచుకొని సమాజాన్ని నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో జంతువుల కంటే మనుషులు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాడు. వాటిలో కరుణ ఒకటి. దీనినే దయాగుణం అని కూడా అంటారు. ఈ దయాగుణం మనిషికి ఏ విధంగా ఉంటుందంటే? ఒక్కోసారి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని అంత.. అది ఎలాగో ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది.
ఒక మహా పండితుడు నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. ఎన్నో వేదాలు, గ్రంధాలు చదివిన అతడు స్నానం చేసే సమయంలో ఒక తేలు నీళ్లలో పడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ తేలును కాపాడడానికి ఆ పండితుడు నీళ్లలో నుంచి దానిని తీసి బయటకు వేద్దామని అనుకుంటాడు. ఈ క్రమంలో చేతితో తేలును పట్టుకోగానే అది కాటు వేస్తుంది. వెంటనే దానిని విడిచిపెడతాడు. మరోసారి దానిని పట్టుకోగానే అలాగే కాటు వేస్తుంది. ఇలా ఆరు సార్లు కాటు వేస్తుంది. అయినా కూడా ఆ పండితుడు దానిని ఎలాగోలా తీసి బయటకు వేస్తాడు.
అయితే ఈ పరిస్థితిని గమనిస్తున్న మరో వ్యక్తి అతని వద్దకు వచ్చి ఇలా అంటాడు. తేలు అన్నిసార్లు కాటు వేస్తున్న కూడా.. దానిని కాపాడాలని ఎందుకు అనుకుంటున్నావు? అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు.. తేలు స్వభావం కుట్టడం.. మనిషి స్వభావం దయ చూపడం.. తేలుకు ఎంత చెప్పినా కూడా పుట్టక మానది.. మనిషికి ఎంత చెప్పినా కూడా ఇతరులపై దయ చూపకుండా ఉండలేడు. అందుకే ధర్మం ఇంకా నిలబడుతుంది అని అంటాడు.
అంటే ఒక వ్యక్తి తాను చేయాలనుకున్న పనిని సమర్థవంతంగా నిర్వహిస్తే.. తనతోపాటు తన చుట్టూ ఉన్నవాళ్లు అభివృద్ధి చెందుతారు. అలాకాకుండా ఇతరుల కోసమో.. ఇతరులను చూసి.. తన స్వభావాన్ని మార్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. అందులోనూ చెడు ఆలోచనలను ఎప్పుడూ ఇతరుల ద్వారా నేర్చుకొని పాటించకూడదు. అలా చేస్తే జీవితంలో ఎప్పటికీ బాగుపడే అవకాశం ఉండదు.
ఒక వ్యక్తి ఎదగడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని పట్టించుకోకుండా.. అనుకున్న పని సాధించడం కోసం ముందుకు వెళితే ఎప్పటికైనా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ అడ్డంకులతో తన క్యారెక్టర్ ను మార్చుకోవడం వల్ల మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నువ్వు ఏంటో తెలుసుకొని దాని ద్వారానే ముందుకు వెళ్లాలి. అది ఎప్పటికైనా లాభమే చేకూరుతుంది.