Nara Lokesh : యువగళం’ సెంచరీ.. లోకేష్ ఎంత సాధించాడు?
యువగళం పాదయాత్రతో టీడీపీకి ఒక భావి నాయకుడు లోకేష్ రూపంలో దొరికాడని తెలుగుదేశం పార్టీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Nara Lokesh : నారా లోకేష్.. రాజకీయాల్లోకి రాక ముందే తన తండ్రి ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. ముందుగా ఆయనపై సాఫ్ట్ ముద్ర వేశారు. నీట్ షేవింగ్ తో ఉండే ఆయన రూపాన్ని చూసి ఎగతాళి చేశారు. తెగ ట్రోల్ చేశారు ఇమేజ్ ను నాశనం చేసేందుకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆయన కోసమే అన్నట్టు ప్రత్యేక సోషల్ మీడియా సైన్యాన్నే నడిపారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే దాడిని కొనసాగించారు. ఇప్పటివరకూ చేస్తూనే ఉన్నారు. అటుపోట్లను ఎదుర్కొని,.. తనను తాను మలుచుకొని లోకేష్ నిలబడిన తీరు అభినందనీయం.కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఇంటలిజెన్స్ పోలీసులు.. వైసీపీ సోషల్ మీడియా మూక.. బూతుల నేతలు ఎంతగా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. అడ్డగింతలు, అభ్యంతరాలు ఎన్నో ఎదురయ్యాయి. చివరకు పాదయాత్ర ఆపేస్తారంటూ ప్రచారం చేశారు. కానీ అది అన్ స్టాపబుల్‌గా వంద రోజులకు చేరుకుంది.
వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ..
వందరోజుల కిందట కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం నాటికి వందరోజులకు చేరుకుంది. ఎన్నెన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ లోకేష్ లక్ష్యం వైపు అడుగులేస్తున్నారు. వాస్తవానికి లోకేష్ పాదయాత్ర ప్రకటించినప్పుడు సొంత పార్టీ శ్రేణులు సైతం అనుమానం వ్యక్తం చేశాయి. పూర్తిచేయగలరా అని భావించాయి. ప్రసంగించే సమయంలో తడబడతారని ఆందోళనలు చెందాయి. అనవసరంగా ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారని అనుమానించాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 100 రోజుల మైలురాయికి చేరుకున్నారు లోకేష్. అటు ప్రత్యర్థుల అంచనాలు తారుమారు చేయగలిగారు.
ఇబ్బందులు ఎదురైనా..
పాదయాత్ర ప్రారంభంలో ప్రభుత్వం ఎన్నెన్నో అవాంతరాలు సృష్టించింది. ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకు అతిగా ప్రచారం కల్పించింది. వందలాది మందితో సోషల్ మీడియా వింగ్ ను తయారుచేసింది. అయితే అవేవీ వర్కవుట్ కాలేదు.ఇప్పుడు లోకేష్ పాదయాత్ర గురించి ట్రోల్ చేయాడనికి ఎవరికీ ధైర్యం లేదు. ఆయన పాదయాత్రలో జనాల్లేరని చెప్పడానికి ఎవరికీ చాన్స్ దొరకడం లేదు. ఆయన స్పీచుల్లో ఎక్కడైనా మాట తప్పు దొర్లితే దాన్ని తీసుకుని పండగ చేసుకుందామని అలా వైసీపీ సోషల్ మీడియాలో ఆఫీసులో వందల మంది చూస్తూనే ఉన్నారు. కానీ ఏమీ దొరకక అనని మాటల్ని అన్నట్లుగా ఎడిట్ చేసుకుని భావ ప్రాప్తి పొందుతున్నారు. వంద రోజుల పాదయాత్ర లో లోకేష్ సాధించిన పరిణితి అంతా ఇంతా కాదు.
ప్రజలతో మమేకం..
ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రజల మధ్య, ప్రజలతోనే గడపడమంటే గొప్ప విషయం. రోజుకు సగటున 1000 మంది వరకూ సెల్ఫీ తీసుకుంటారు. వారందరికీ ఓపికగా, విసుగు లేకుండా సమయం ఇవ్వడం కూడా ఓ పరీక్షలాంటిదే. మూడు జిల్లాల్లో 39 నియోజకవర్గాలను కవర్ చేస్తూ వంద రోజుల పాదయాత్ర ముగిసింది. ఇంకా 300 రోజులు మిగిలి ఉంది. రాయలసీమలోనే పాదయాత్రకు విశేష ఆదరణ ఉంటే .. కోస్తాలో అయితే ప్రభంజనం తధ్యమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. యువగళం పాదయాత్రతో టీడీపీకి ఒక భావి నాయకుడు లోకేష్ రూపంలో దొరికాడని తెలుగుదేశం పార్టీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
