YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు : వైసీపీ డైవర్షన్ పాలిట్రిక్స్
అయితే అవి డైవర్షన్ కోసం చేస్తున్నవే కానీ.. కోర్టులో నిలబడవని ప్రభుత్వానికి తెలుసు. అయినా తన టెంపరితనాన్ని చూపిస్తోంది.

YS Viveka Case : ఏపీలో జగన్ ప్రభుత్వ చర్యలు ఇట్టే అర్థమైపోతాయి. ప్రభుత్వానికి ప్రతికూల చర్యలు, ఘటనలు ఎదురైతే కొన్ని అస్త్రాలను బయటకు తీస్తుంది. విపక్షాలను టార్గెట్ చేస్తూ కేసులు, అరెస్టుల పర్వం నడుపుతుంది. ఇప్పుడు చంద్రబాబు నివాసముంటున్న గెస్ట్ హౌస్ అటాచ్ వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మీదకు ఏదో ఉపద్రవం రానుందని.. దానిని అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ఉపయోగించిన చట్టాలు చూసి న్యాయ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రైవేటు ఆస్తులను అటాచ్ చేయాలంటే చాలా రకాల నిబంధనలున్నాయి. కానీ అవేవీ పాటించకుండా ఇష్టారాజ్యంగా చేయడంపై అనుమానాలున్నాయి.
కోర్టులో నిలబడుతుందా?
అయితే అటాచ్ కోసం ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి ఆర్డినెన్స్, వాటిలోని సెక్షన్లు ఉపయోగించారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా మోపిన అభియోగాలు కనిస్తున్నాయి, ఏదైనా నేరం జరిగినప్పుడు రుజువులు చూపించాలి. నేరం ద్వారా లబ్ధిగా వచ్చిన డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేశారని నిరూపించాలి. ఆ తరువాత న్యాయమూర్తి ముందు పెట్టి జప్తునకు అనుమతులు తెచ్చుకోవాలి. కానీ చంద్రబాబు నివాసముంటున్న గెస్ట్ హౌస్ జప్తునకు ఈ మార్గదర్శకాలేవీ పాటించలేదు. ఇప్పుడు అనుమానాలకు అవే కారణాలుగా కనిపిస్తున్నాయి. నేరుగా అటాచ్ చేస్తామంటే కుదరదు. ఇది సీఐడీ అధికారులకు తెలియనిది కాదు. కానీ ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో ఒత్తిడి ఎదురుకావడంతో అటాచ్ ఉత్తర్వులిచ్చారు. ఇవీ న్యాయస్థానంలో నిలబడవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
పెద్ద స్కెచ్..
అర్జెంట్ గా లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ బయటకు రావడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టు సమాచారం వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు మీద ఉంది. కర్నాటక ఎన్నికల తరువాత మరింత పట్టుబిగించనున్నట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్న టాక్ నడుస్తోంది. దాని నుంచి డైవర్షన్ చేసేందుకే కొత్తగా అటాచ్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు అనుమానాలున్నాయి. వివేకా హత్య కేసులో సంచలనాలు నమోదుకానున్నాయని జగన్ సర్కారుకు సమాచారం అందింది. అందుకే పోటీగా మరోకేసును తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. మీడియాతో పాటు పార్టీల చూపును పక్కదారి పట్టించడానికేనంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ పాత పాటే..
అమరావతి విషయంలో మళ్లీ పాత పాటనే మొదలుపెట్టారు. ఇన్ సైడ్ డ్రేడింగ్ అంటూ కొత్త కథను అల్లుతున్నారు. వాస్తవంగా అక్కడ ఇన్నర్ రింగు రోడ్డు అంటూ లేదు. ఒక్క గజం కూడా సేకరించలేదు. అసలు అక్కడ పనులే చేయలేదు. కానీ అక్కడ అవినీతి జరిగిందన్నది జగన్ సర్కారు ఆరోపణ. చేయని పనుల్లో అవినీతి ఏంటనేది ప్రభుత్వమే చెప్పాలి. అయితే అవి డైవర్షన్ కోసం చేస్తున్నవే కానీ.. కోర్టులో నిలబడవని ప్రభుత్వానికి తెలుసు. అయినా తన టెంపరితనాన్ని చూపిస్తోంది.
