YS Viveka Case: వివేకా హత్య కేసు సస్పెన్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ
వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమై నాలుగేళ్ల దాటింది. కేసు కొలిక్కి వస్తుందన్న దశలో మరో కొత్త విషయం బయటకు వస్తోంది. హత్య జరగడానికి ముందు, ఆ తరువాత ఆ రోజు ఏం జరిగిందన్న విషయంపైనే సీబీఐ ఎంక్వైరీ ప్రధానంగా సాగుతుంది.

YS Viveka Case: ఉత్కంఠతగా మారిన వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అసలు నిందితులు వీరేనని సీబీఐ అధికారులు చెబుతున్నా, హత్యకు గల కారణాలను మాత్రం విశ్లేషించలేకపోతుంది. ఈ క్రమంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి చుట్టూనే హత్య కేసు విచారణ జరుగుతున్నా, అసలు కారణం ఏంటనేది స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలో సీబీఐ మరోసారి కీలక వాదనలను తెలంగాణ హైకోర్టులో వినిపించింది.
వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమై నాలుగేళ్ల దాటింది. కేసు కొలిక్కి వస్తుందన్న దశలో మరో కొత్త విషయం బయటకు వస్తోంది. హత్య జరగడానికి ముందు, ఆ తరువాత ఆ రోజు ఏం జరిగిందన్న విషయంపైనే సీబీఐ ఎంక్వైరీ ప్రధానంగా సాగుతుంది. హత్యలో ప్రధాన పాత్రధారులుగా ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, దస్తగిరి, భాస్కర్ రెడ్డిలతో అవినాష్ రెడ్డి ఉన్నట్లు సీబీఐ పేర్కొంటుంది. వీరిలో ఒక్క అవినాష్ రెడ్డి మినహా అందరినీ సీబీఐ అరెస్టు చేసింది.
అవినాష్ రెడ్డి హత్య చేయించారని మొదటి నుంచి మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తే… ఒకటి కడప ఎంపీ సీటు కోసం, మరొకటి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఆస్తుల తగాదాలు అంటూ కొత్త స్వరం అందుకోవడం. హత్య జరిగిన తరువాత వైసీపీ నాయకులు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. అయితే, సీబీఐ విచారణలో అంతా వట్టిదే అని తేలిపోయింది. ఈ క్రమంలో వివేకా రెడ్డి హత్య జరగడానికి బలమైన కారణం ఏంటనేది మాత్రం తెలియరావడం లేదు.
మరికొద్ది రోజుల్లో విచారణ ముగుస్తుందని సీబీఐ పేర్కొంటుంది. వివేకా హత్య జరిగినప్పుడు సాక్ష్యాలను చరిపేసేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తుంది. అవినాష్ రెడ్డి, భాస్కర రెడ్డి సూచనలతోనే ఆయన ఈ పని చేశారని వివరించారు. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఈ రోజు కోరింది. బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ నెల11 కి వాయిదా వేసింది. కేసు డైరీని కోర్టుకు సమర్పించాలని సీబీఐకి సూచించింది. కాగా, అవినాష్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. ప్రతిసారి ఆయన అరెస్టు జరుగుతుందని భావిస్తున్నా, బెయిల్ లభిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఆయనను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది.
