ys sharmila ponguleti srinivas reddy : భారత రాష్ట్ర సమితిలో విలువలేదు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందనే భరోసా లేదు.. మరోవైపు అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోంది.. పోయిన ప్రతి చోటల్లా ప్రజల నుంచి అదే ప్రశ్న తలెత్తుతోంది.. కెసిఆర్ ను పలుమార్లు కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. కేటీఆర్ శిబిరం నుంచి ఎటువంటి అపన్న హస్తం వచ్చే అవకాశం లేకుండా పోయింది.. హరీష్ నుంచి భరోసా దక్కలేదు.. కవిత నుంచి తోడ్పాటు లభించలేదు.. ఎటు చూసుకుంటే అటు నిర్లిప్తత, నిర్లక్ష్యం.. ఐదేళ్లు గడిచిపోయాయి.. ఇక పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి కూడా ఓపిక నశించింది.. అధిష్టానం పై స్వరం పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా అది నిరసనకు దారి తీసింది. “ఈ ఐదేళ్లు మనకు ఏ గౌరవం దక్కింది” అనే స్థాయికి దారి తీసింది.. చినికి చినికి గాలి వానలా మారినట్టు మొత్తానికి భారత రాష్ట్ర సమితికి ఆయనకు మధ్య దూరం పెరిగింది.. ఇక పార్టీకి రాం రాం చెప్పడమే మిగిలింది.
ఇలాంటి సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజెపిలో చేరుతారు అని అందరూ అనుకున్నారు.. అమిత్ షా నుంచి బలమైన సంకేతాలు కూడా వచ్చాయని అందరూ విశ్వసించారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ తర్వాత షా సమక్షంలో బిజెపిలో చేరడం ఇక లాంచనమే అని అందరూ అనుకున్నారు. కానీ అందుకు అనుగుణంగా అడుగులు పడటం లేదు.. పైగా రోజురోజుకు పొంగులేటి క్యాంప్ పై ఒత్తిడి పెరుగుతోంది.. ఈ సమయంలో దానిని నివారించేందుకు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.. అధికార భారత రాష్ట్ర సమితి పై విమర్శలు గుప్పిస్తున్నారు.. నిన్న ఇల్లందులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర స్వరంతో పొంగులేటి కెసిఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.. ఇదే సమయంలో ఆయనకు కౌంటర్ గా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ విమర్శలు చేశారు.. సో మొత్తానికి ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.
పొంగులేటి శిబిరంలో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన మట్టా దయానంద్ విజయ్ కుమార్ కీలకంగా ఉన్నారు.. ఈయన 2014 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో ప్రయాణం చేస్తున్నారు.. 2014లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.. ఆ సమయంలో ఆయన తన సమీప ప్రత్యర్థి సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓడిపోయారు.. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి అశ్వరావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వైరా నుంచి బానోత్ మదన్ లాల్ లను వైఎస్ఆర్సిపి అభ్యర్థులుగా నిలబెట్టి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అప్పుడు రాష్ట్రం మొత్తం భారత రాష్ట్ర సమితి గాలివీస్తే.. ఖమ్మంలో మాత్రం ఫ్యాన్ గాలి వీచింది.. అంతేకాదు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అప్పటి టిడిపి అభ్యర్థి నామ నాగేశ్వరరావు మీద భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో తాను గెలిపించిన ఎమ్మెల్యేలు, తాను అధికార భారత రాష్ట్ర సమితిలో చేరారు.. ఇక అప్పటినుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు.. ఇదే సమయంలో ఆయనకి 2019లో ఎంపీ టికెట్ లభించలేదు. నామ నాగేశ్వరరావు వైపు కేసీఆర్ మొగ్గు చూపించారు.. ఎన్నికల ప్రచారంలో భరోసా ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు.. ఇలా పలుమార్లు కేసీఆర్ చేతిలో పొంగులేటి భంగపాటుకు గురయ్యాడు.
మరోవైపు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరాలనే డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతున్నది. మన ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆయన నివాసానికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు.. మరోవైపు మట్టా దయానంద్ విజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతుండగానే పొంగులేటి శ్రీనివాస రెడ్డి షర్మిల పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది.. షర్మిల ను పొంగులేటి కలిసినట్టు వార్తలు రావడంతో పోయి పోయి ఆమె పార్టీలో చేరుతున్నావా అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీలో చేరేందుకు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ షర్మిల పార్టీలో చేరితే రాజకీయంగా పొంగులేటి కెరియర్ ముగిసిపోవడం ఖాయమని పేరు రాసేందుకు ఇష్టపడని ఆయన అనుచరుడు ఒకరు “ఓకే తెలుగు” తో పేర్కొన్నారు. మరీ పొంగులేటి అడుగులు ఎటు వైపు? బిజెపి తీర్థం పుచ్చుకుంటారా? కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? షర్మిల తో కలిసి ప్రయాణం చేస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.