Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ టూర్.. మారిన సిగ్నల్స్
ఢిల్లీ నుంచి వేరే సంకేతాలు అందుతున్నాయి. జగన్ సర్కారుకు సంపూర్ణ సహకారం లభిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Jagan Delhi Tour : ఢిల్లీలో ఇప్పుడు ఏపీ రాజకీయాలే హైలెట్ గా నిలుస్తున్నాయి. జగన్ ను టార్గెట్ చేసుకొని టీడీపీ, జనసేనలు పావులు కదుపుతున్నాయి. వచ్చేఎన్నికల్లో కూటమి కట్టాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీని కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ పరిణామంతో జగన్ అలెర్టయ్యారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద పట్టుబిగించేందుకు పావులుకదుపుతున్నారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చేందుకు వ్యూహం పన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పరిస్థితులను చక్కదిద్దాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఈ రోజు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొనున్నారు. ప్రధాని మోదీతో పాటుగా హోం మంత్రి అమిత్ షా, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశం అవుతారని తెలుస్తోంది. నీతి అయోగ్ సమావేశంలో రాష్ట్రం పలు అంశాల్లో సాధించిన పురోగతి..అమలు చేస్తున్న విధానాలను వివరించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సాయం పైన సమీవేశంలో ప్రస్తావించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ప్రారంభోత్సవ విషయంలో సీఎం జగన్ ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ను రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కార్యక్రమానికి గైర్హాజరు కావాలని 19 విపక్ష పార్టీలు డిసైడయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మద్దతుగా నిలిచారు. ప్రధానికి అభినందనలు తెలిపారు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో ఎప్పుడో పదేళ్ల కాలం కిందట ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసింది. నాడు చంద్రబాబు సర్కారు అడిగితే ముప్పుతిప్పలు పెట్టిన మోదీ సర్కారు.. ఒకేసారి ఏకంగా రూ.10 వేల కోట్లు జగన్ సర్కారుకు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ ను ఊరటనిచ్చేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఎన్నికల వరకు ఇదే రకమైన మద్దతు జగన్ కోరుకుంటున్నారు. నూతన పార్లమెంట్ ప్రధాని ప్రారంభిస్తున్న వేళ సీఎం జగన్ స్వయంగా హాజరవుతున్నారు. ప్రధాని మోదీతో తనకు ఉన్న సత్సంబంధాలను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ పొత్తులపైన క్లారిటీ ఇవ్వనుంది. జనసేనాని పవన్ అటు బీజేపీని తమతో కలిసి రావాలని ప్రతిపాదించారు. దీని పైన బీజేపీ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ ను ఇరుకున పెట్టే వ్యూహాలకు చంద్రబాబు, పవన్ పదును పెడుతున్నారు. కేంద్రం నుంచి జగన్ కు మద్దతు లేకుండా చేయాలనేది వారి వ్యూహం. కానీ ఢిల్లీ నుంచి వేరే సంకేతాలు అందుతున్నాయి. జగన్ సర్కారుకు సంపూర్ణ సహకారం లభిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.