YS Jagan – Electrictiy Prices : బాదుడే బాదుడు.. విద్యుత్ షాకిస్తున్న జగనన్న
రోజంతా కరెంటు ఇస్తున్నామని గొప్పలకు పోతూ… ఆ భారమంతా జనంపైనే వేస్తున్నారు. సర్దుబాటు చార్జీలకు తోడు ఇంధన సర్‌చార్జీ, కన్జ్యూమర్ చార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇలా రకరకాల పేర్లతో సగటు వినియోగదారుడికి షాకిస్తున్నారు.

YS Jagan – Electrictiy Prices : బాదుడే బాదుడు.. విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ తీసిన రాగం ఇది. బహుశా ఈ కామెంట్ కు పేటెంట్ హక్కుదారుడు కూడా జగనే. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత తెగ బాదేస్తున్నారు. ఎడాపెడా చార్జీలు, పన్నులు పెంచి ప్రజలకు బాదుడే బాదుడు అన్న తన మాటను గుర్తు చేస్తున్నారు. అయితే బాదుడు విషయంలో జగన్ ఏ వర్గానికి మినహాయింపు ఇవ్వలేదు. పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా… అందరినీ సమానంగా బాదేస్తున్నారు. రోజంతా కరెంటు ఇస్తున్నామని గొప్పలకు పోతూ… ఆ భారమంతా జనంపైనే వేస్తున్నారు. సర్దుబాటు చార్జీలకు తోడు ఇంధన సర్‌చార్జీ, కన్జ్యూమర్ చార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇలా రకరకాల పేర్లతో సగటు వినియోగదారుడికి షాకిస్తున్నారు. కరెంటు వాడకం చార్జీలకు సమానంగా ఇతర చార్జీలు కనిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా ఇంధన సర్దుబాటు చార్జీ నెలకు 200 యూనిట్లు పైబడి కరెంటును వాడేవారిపైనే పడుతుందని సామాన్యులు భావిస్తున్నారు. కానీ… ఇప్పుడు సగటు వినియోగదారుడిపైనా ఆ భారం పడుతోంది. ఎప్పుడో వాడిన కరెంటుకు తక్కువ చార్జీ వసూలు చేశామంటూ… ఆ డబ్బులను ఇప్పుడు వసూలు చేయడమే ‘ఇంధన సర్దుబాటు’. ప్రస్తుతం మూడు సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్నారు. పోనీ ఇంత చేసి విద్యుత్ కోతలు లేవంటే సమాధానం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు అప్రకటిత విద్యుత్ కోతతో హోరెత్తిస్తున్నారు. అటు సరఫరా లేకుండా.. కరెంట్ బిల్లులను ప్రభుత్వం బాదేయడం చూసి.. జనం అవాక్కవుతున్నారు. అసలు చార్జీల కన్నా రెట్టింపు బిల్లు చేతికిస్తున్నారు. కట్టకపోతే కరెంట్ కనెక్షన్ పీకేస్తున్నారు.
డిస్కంలను దోపిడీ కేంద్రాలుగా మార్చేశారు. సర్ ప్లస్ విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలు విధానాలతో అస్తవ్యస్తం చేశారు. ఒక్క యూనిట్ కరెంట్ ఇవ్వని హిందూజాకు 1250 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. బినామీ కంపెనీ అయిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ నుంచి వేల కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్లు అవసరం లేకపోయినా కొనిపడేశారు. ఇవన్నీ ప్రజలమీదే రుద్దారు.ఇప్పటివరకూ అధికారికంగా కరెంట్ చార్జీలు ఎన్ని సార్లు పెంచారో లెక్కే లేదు. అయితే ప్రభుత్వం చేసిన అవినీతి .. డిస్కంలను దోచుకున్న దానికీ.. ప్రజల దగ్గర బాదేస్తూండటమే అసలు విషాదం. ఇంధర సర్దుబాటు పేరుతో ఎఫ్‌పీసీసీఏ చార్జీలు అంటూ ఓ సారి వడ్డించారు. రెండో సారి కూడా వడ్డించారు. అంటే కరెంట్ బిల్లులు రెండు ఇందన సర్దుబాటు చార్జీలు కనిపిస్తున్నాయి. దీనికి ట్రూ అప్ చార్జీలు అదనం. ఇవన్నీ ఎందుకు అంటే బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరకు కరెంట్ కొనుగోలు చేసినందుకు అని చెబుతున్నారు.
రూ.300 కరెంట్ వినియోగిస్తే రూ.600 వడ్డిస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తుంటే వాడారు.. కట్టండి అని సమాధానం చెబుతున్నారు. మరో అడుగు ముందుకేసి అడిగితే సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి. చార్జీలు పెంచకూడదు. అప్పులు చేయకూడదంటే ఎలా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపేమిటంటే.. రేపోమాపో స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీ .. వాటా ఈ బిల్లుల్లో చేరబోతోంది. అప్పుడు సగటు వినియోగదారుడికి దబిడ దిబిడే. సామాన్య, మధ్యతరగతి వారు సైతం నెలలో ఒకటో తారీఖుకు రూ.1000కు పైగా ఉంచుకోవాల్సిందే. లేకుంటే విద్యుత్ కనెక్షన్ పీకేయ్యడం ఖాయం.
