Rushi Raj YCP Strategist : యావత్ పార్టీని అతడి చేతిలో పెట్టి నొక్కేస్తున్న జగన్
151 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలతో అన్ని నియోజకవర్గాల్లో నాయకత్వానికి కొదువ లేదు. అయితే పక్క పార్టీ నేతలను ఆకర్షించే పనిలో ఉండడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అతికి మూల్యం తప్పదని భావిస్తున్నారు.

Rushi Raj YCP Strategist : వైసీపీలో అధినేత జగన్ డమ్మీగా మారారా? ముఖ్య సలహాదారుడు సజ్జల హవా తగ్గిందా? పార్టీలో ఎంతటి కాకలు తిరిగిన యోధులైనా సైలెంట్ గా ఉండాల్సిందేనా? పార్టీలో అల్టిమేట్ పవర్ ఆయనదేనా? ఆయన ముందూ అంతా దిగదుడుపేనా? ఇంతకీ వైసీపీ తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరంటే…వైసీపీ వర్గాల నుంచి వినిపించే మాట రుషిరాజ్ సింగ్. ప్రస్తుతం వైసీపీ వర్గాలు ఆయన్ను అనధికారిక అధ్యక్షుడిగా భావిస్తున్నాయి. ఆయన పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నాయి. యావత్ పార్టీని అతడి చేతిలో పెట్టి జగన్ బటన్ నొక్కుడు, పాలన చూసుకుంటున్నారు. తెర వెనుక అంశాలను మాత్రం రుషిరాజ్ చక్కదిద్దుతున్నారు. వైసీపీ ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా ఉన్న రుషిరాజ్ ఐ ప్యాక్ టీమ్ తో అధికార వైసీపీ నేతలను పరుగుపెట్టిస్తున్నారు. వారికి కంటీమద కునుకు లేకుండా చేస్తున్నారు.
పెద్దపెద్ద నేతలు సైతం..
బాలినేని శ్రీనివాసరావు అంతటి వాడే రుషిరాజ్ ముందు చేతులు కట్టుకోవాల్సి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యన బాలినేని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు అందుకున్న బాలినేని జగన్ ను కలిశారు. అయితే కొద్దిసేపే మాట్లాడిన బాలినేని.. తరువాత రుషిరాజ్ ను కలిశారు. జగన్ కంటే ఎక్కువసేపు రుషిరాజ్ తోనే గడిపారన్న టాక్ ఉంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి రాజకీయాలన్నింటిపైనే రుషిరాజ్ చర్చించినట్టు సమాచారం. ఒక్క బాలినేని ఎపిసోడే కాదు.. పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యవహారమైనా రుషిరాజ్ సింగ్ టీమే యాక్టివ్ రోల్ ప్లే చేస్తోంది,
జగన్ అపార నమ్మకం..
రుషిరాజ్ కు తెలుగు కూడా అంతగా రాదు. కానీ వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. పూర్వపు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష స్ట్రాటజీల నుంచి విరమించుకుని బీహార్ లో రాజకీయ యాత్రలు చేసుకుంటున్నారు. ఆయనకు బదులుగా రుషిరాజ్ బాధ్యతలు తీసుకున్నారు. నిజానికి ఈ రుషిరాజ్ గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన కీలక వ్యక్తుల్లో ఒకరు. పీకే స్ట్రాటజీలు చెబితే.. పక్కాగా అమలు చేసేవాడు రుషిరాజ్. అందుకే జగన్ కు ఈయనపై చాలా నమ్మకం ఏర్పడింది. ఎన్నికల తర్వాత ..సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీలో రుషిరాజ్ పెళ్లి జరిగితే ప్రత్యేక విమానంలో సతీసమేతంగా జగన్ వెళ్లారు. అంత నమ్మకం పెట్టుకున్న ఆయన… ఇప్పుడు పార్టీని పూర్తిగా చేతుల్లో పెట్టేశారు.
నేతలను డామినేట్ చేస్తూ..
రుషిరాజ్ చర్యలతో వైసీపీ నేతలు హర్టవుతున్నారు. ఇటీవల ఆయన చర్యలేవీ రుచించడం లేదు. జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ ఇటీవల వైసీపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటింటికీ స్టిక్కర్లు అతికించడం కాన్సెప్ట్ రుషిరాజ్ దే. అయితే సీఎం జగన్ ఇచ్చిన ఫ్రీడమ్ తో నాలుగు రాళ్లు వెనుకేసుకునే పనిలో ఆయన ఉన్నారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి స్టిక్కర్లు బ్యాగులు అన్నీ ఢిల్లీలోని తమ అనుబంధ సంస్థ పేరుతో తెప్పించారు. ఇక్కడ అసలు వైసీపీ నేతలకు.. సంబంధమే లేకుండా పోయింది. దీంతో ఎంతో కలత చెందుతున్నారు. రుషిరాజ్ సింగ్ అంతటితో ఆగకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు టిక్కెట్ల ఆఫర్ చేస్తున్నారని తెలియడంతో ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే ఉన్న 151 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలతో అన్ని నియోజకవర్గాల్లో నాయకత్వానికి కొదువ లేదు. అయితే పక్క పార్టీ నేతలను ఆకర్షించే పనిలో ఉండడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అతికి మూల్యం తప్పదని భావిస్తున్నారు.
