YouTube: ” యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను.. లైక్,షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్”. “ట్రావెల్ వ్లాగ్ మొదలుపెట్టాను. ప్రతి వారాంతానికి విహారయాత్రకు వెళ్లి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నా. తప్పకుండా చూడు” సన్నిహితుల నుంచో, స్నేహితుల నుంచో ఇలాంటి అభ్యర్థన లు తరచూ మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది స్మార్ట్ యుగంలో కాబట్టి… సామాజిక మాధ్యమాలు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు కొత్త కొత్త యాప్ లు పుట్టుకు రావడంతో మన జీవనం మరింత సులభం అవుతున్నది.. అయితే ఇక్కడ వాటిని ఏ ప్రయోజనం కోసం వాడుతున్నాం అనేది ముఖ్యం. వాస్తవానికి సామాజిక మాధ్యమాలను కొందరు కాలక్షేపం కోసం చూస్తారు. కొందరు కొత్త పరిచయాలు, స్నేహ బృందాన్ని విస్తరించుకునేందుకు వాడుతూ ఉంటారు.. కొందరు తమకు ఆసక్తి ఉన్న విషయాలను తెలుసుకునేందుకు వాడుతూ ఉంటారు. ఇంకొందరు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు, పబ్లిసిటీ కోసం వాడుతూ ఉంటారు. ఇక యూట్యూబ్.. లాంటి సామాజిక మాధ్యమాలు మనదేశంలో ఐదు కోట్ల మందికి ఉపాధి చూపిస్తున్నాయి. వాళ్లల్లో ఒక్కొక్కరు నెలకు పాతికవేల నుంచి కోటి రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు.

YouTube
-పల్లెలకూ పాకింది
కోటి మంది సబ్స్క్రైబర్లతో చరిత్ర సృష్టించిన తమిళనాడు విలేజ్ కుకింగ్ ఛానల్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిందే. వీళ్ళు వీడియోలు పెడితే మినిమం కోటి వరకు వ్యూయర్ షిప్ ఉంటుంది. ఇక తెలుగునాట బాగా పరిచయమైన “మై విలేజ్ షో” తో ఆకట్టుకున్న గంగవ్వది తెలంగాణలోని లంబాడి పల్లి అనే ఊరు. ఈమె ఛానల్ కు కూడా లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈమె ఏకంగా బిగ్ బాస్ షో కు కూడా వెళ్ళింది. “అరకు ట్రైబల్ కల్చర్ ” పేరుతో గిరిజనుల జీవన శైలి ని వివరిస్తున్న చానెల్ ను ఒక ఆదివాసీ నిర్వహిస్తున్నాడు. వీరే కాకుండా ఇంకా చాలామంది గ్రామాల నుంచి వచ్చిన వారే. సామాజిక మాధ్యమాలకు మొదట్లో నగరాల్లో మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు అది గ్రామాలకు కూడా పాకింది. కంటెంట్ వినియోగించుకునే వారిలోనూ, రూపొందించే వారిలోనూ వీరిదే పై చేయి. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లాంటివే కాకుండా దేశంగా జోష్, మోజ్, చింగారీ లాంటి ఆప్ లకు కూడా విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. దేశంలో 45 కోట్ల మంది సోషల్ మీడియాను వాడుతుండగా.. వారిలో 16 కోట్ల మంది జోష్, మోజ్, చింగారీ లాంటి యాప్స్ వాడుతున్నారు.
33, 000 కోట్లు కాగలదు
యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ ఉన్నవాడే కింగ్.. అది రాత అవొచ్చు.. వీడియోలు అవొచ్చు. ఆడియో కూడా అవొచ్చు. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో కంటెంట్ క్రియేటర్స్ వ్యవస్థ విలువ ప్రస్తుతం 3,265 కోట్ల దాకా ఉంది. అది మరో నాలుగేళ్లకి 33 వేల కోట్లకు పెరుగుతుంది.. అంత అవకాశం ఉంది కాబట్టే సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ క్రియేట్ చేసే అంకుర సంస్థలకు 16 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. ఇక ఈ తరహా ఫండింగ్ 2021 లో 75% పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.. అయితే అన్నింటిని దెబ్బతీసిన కరోనా ఈ రంగానికి మాత్రం మేలు చేసింది.. ఆర్థిక మాంద్యం ముందు ఉంది అనే భయాలను కూడా పక్కనపెట్టి ఈ ఏడాది మొదట్లో జోష్ యాప్ పేరెంట్ కంపెనీ వర్ సే ఇన్నోవేషన్ కు ఆరున్నర వేల కోట్ల దాకా పెట్టుబడులు వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఈ ఏడాది స్టార్టప్ ఫండింగ్ లో చెప్పుకోదగ్గ పెద్ద మొత్తం అంటే బహుశా ఇదే కావచ్చు.. ఇక ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అనే కన్సల్టింగ్ నివేదిక ప్రకారం 2020లో మన దేశ జిడిపికి యూట్యూబ్ క్రియేటర్ వ్యవస్థ ఆరువేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జమ చేసింది.. ఒక రకంగా చెప్పాలంటే 6.83 లక్షల పూర్తిస్థాయి ఉద్యోగాలకు అది సమానం.

YouTube
షరతులు వర్తిస్తాయి బాస్
కంటెంట్ ఏది పడితే అది వినియోదారులు చూడటం లేదు.. తమకు నచ్చిన, అందులో తమను తాము చూసుకోగల కంటెంట్ కోసం వెతుకుతున్నారు. అలాంటి ఒరిజినాలిటీ ఉన్న కంటెంట్ నే సబ్స్క్రయిబ్ చేసి మళ్లీ మళ్లీ చూస్తున్నారు. దీనిని గమనించిన కంపెనీలు మంచి కంటెంట్ రూపొందించగల వారి వెంట పడుతున్నాయి.. స్మార్ట్ఫోన్ లేని ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని జనరేషన్ జెడ్ తరం ఇది.. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడే ఈ యువతరాన్ని చేరాలంటే డిజిటల్ వీడియోలే ఉత్తమ మాధ్యమాలని వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. వీటిని రూపొందించే వారికి లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి. అయితే కంటెంట్ తయారీ అంత తేలికైన విషయం కాదు. అలాగని కష్టం కూడా కాదు. ఇక్కడ ప్రధాన పెట్టుబడి సృజనాత్మకత.. అది ఎంత బాగుంటే అంత ఆదరణ లభిస్తుంది.. చాలామంది కూడా తమకు నచ్చిన పనిని ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. ఎక్కడికో వెళ్ళకుండా ఫోన్లో ఉన్న టూల్స్, ఫిల్టర్ల ఆధారంగా ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. ఈ వెసలు బాటు ఉండబట్టే చాలామంది సులభంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారు.. సృజనాత్మకత లేని వారు… సోషల్ మీడియా ప్రయోజనాలు బాగా తెలిసిన వారు మేనేజర్లుగా, డాటా విశ్లేషకులుగా వ్యాపార సంస్థలకు సేవలు అందిస్తున్నారు.
ఇలా ఉంటుంది సంపాదన
సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు? నాకు సబ్స్క్రైబర్లు పెరిగితే ఆదాయం ఎలా వస్తుంది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. దేశంలో సెలబ్రిటీలకు ఉన్నంత ఫాలోయింగ్ మిగతా వారికి ఉండదు. అయితే సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వారు తాము సృజనాత్మకమైన కంటెంట్ ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకోవచ్చు. ఇక కంటెంట్ క్రియేటర్స్ నాలుగు గ్రూపులుగా ఉంటారు.
*నానో: 1000 నుంచి 10,000 వరకు ఫాలోవర్స్ ఉంటారు. వీరు ఒక పోస్ట్ కు 4000 దాకా సంపాదించవచ్చు
*మైక్రో: ఫాలోవర్లు 10,000 నుంచి లక్ష దాకా ఉంటారు ఆదాయం 40 నుంచి 60 వేల దాకా వస్తుంది.
*మ్యాక్రో: లక్ష నుంచి పది లక్షల వరకు ఫాలోవర్లు ఉంటారు. బ్రాండ్ ఆధారంగా పెట్టే పోస్టుకి లక్షన్నర నుంచి మూడున్నర లక్షల దాకా వస్తుంది.
*మెగా: ఫాలోవర్స్ సంఖ్య పదిలక్షల పైన ఉంటే.. మీరు పెట్టే ప్రతి పోస్ట్ కి నాలుగు లక్షల దాకా వస్తుంది. ఇక మన దేశంలో ఏటా 25% చొప్పున పెరుగుతున్న ఈ రంగం విలువ 2025 నాటికి 2200 కోట్లకు చేరుతుంది.
ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని యూట్యూబ్ చూడడమో, గేమ్స్ ఆడటమో తప్ప చదువుకునేది ఏమైనా ఉందా? అనే తల్లిదండ్రులు.. మీ పిల్లలు ఫోన్ తో ఏం చేస్తున్నారో గమనించండి. ఏమో రేపటి సోషల్ మీడియా ఇన్ ప్లు యే న్సర్ మీ ఇంట్లోనే ఉన్నారేమో ఎవరికి ఎరుక?!