Yogi Adityanath Matrubhumi Yojana: ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో యోగి కొత్త పథకం.. పల్లెల అభివృద్ధికి వినూత్న ఆలోచన!
మాతృభూమి యోజన పేరుతో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరాలు, విదేశాలకు వలసపోయిన యూపీకి చెందిన వారు తిరిగి తాము పుట్టి పెరిగిన పల్లెల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా వారిని ఒప్పించడం ఈ పథకం లక్ష్యం. తద్వారా యూపీ పల్లెల్లోనూ వెలుగులు నింపాలనేది యోగీ ఆదిత్యనాథ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎన్నారైలకు పరిమితం చేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత నగరాలకూ విస్తరింపచేయనున్నట్లు సమాచారం.

Yogi Adityanath Matrubhumi Yojana: తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో సంచలనం రేపింది. రాష్ట్రంలోని చిన్నచిన్న పల్లెలు, పట్టణాల నుంచి నగరాలకు, విదేశాలకు వెళ్లి స్ధిరపడిన శ్రీమంతులు తాము పుట్టిన గడ్డకు తిరిగొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావడం అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమా ప్ఫూర్తితో విదేశాల్లో స్థిరపడిన కొంతమంది తమ సొంత ఊరికి తమవంతు సాయం కూడా చేశారు. ఇప్పటికీ కొంతమంది చేస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌ను యూపీలో అమలు చేసేందుకు అక్కడి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక పథకం ప్రారంభించింది.
మాతృభూమి యోజన..
మాతృభూమి యోజన పేరుతో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరాలు, విదేశాలకు వలసపోయిన యూపీకి చెందిన వారు తిరిగి తాము పుట్టి పెరిగిన పల్లెల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా వారిని ఒప్పించడం ఈ పథకం లక్ష్యం. తద్వారా యూపీ పల్లెల్లోనూ వెలుగులు నింపాలనేది యోగీ ఆదిత్యనాథ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎన్నారైలకు పరిమితం చేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత నగరాలకూ విస్తరింపచేయనున్నట్లు సమాచారం.
స్వగ్రామాలతో అనుబంధం పెంచేలా..
నగరాల్లో లేదా విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు తమ స్వగ్రామాలతో అనుబంధం పెంచడంతోపాటు అభివృద్ధికి తోపడ్పాటు అందించేలా, సొంతంగా పనులు చేయడానికి, మౌలిక వసతులు కల్పించడానికి, అభివృద్ధి పనులకు ఆర్థికసాయం చేయడానికి ఈ పథకం రూపొందించినట్లు యోగీ సర్కార్ చెబుతోంది. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుందని, మొదటిది వ్యక్తులు వారి మూలాలతో తిరిగి కనెక్ట్ కావడం, అలాగే వారు తమ మాతృభూమికి సాయం చేయడం అని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
సెంటిమెంటుతో..
తల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. వాటి మధ్య పోలిక ఉండదు. కావున ప్రతి ఒక్కరూ మాతృభూమి యోజనలో పాల్గొనే అవకాశం కల్పించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నవంబర్ 2021లో ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఏదైనా గ్రామం అభివృద్ధికి సహకరించడానికి వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలను సులభతరం చేయడానికి మాతృభూమి యోజన అమలు ప్రతిపాదనను ఆమోదించింది.
స్పందన ఎలా ఉంటుందో..
వాస్తవానికి యూపీలో ఉపాధి లేక అక్కడి కూలీలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. నైపుణ్యం ఉన్నా.. తగిన వేతనం కూడా అక్కడ లభించదు. దీంతో చాలా మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రకు వలస వస్తుంటారు. ఇలా బతుకుదెరువు కోసం వచ్చిన వారి నుంచి పెద్దగా ప్రయోజనం ఉండదు. వ్యాపార, వాణిజ్యరంగాల్లో స్థిపపడిన వారు మాత్రం కొంత స్పందించే అవకాశం ఉంది. విదేశాల్లోనూ యూపీ నుంచి ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారంతా ఉపాధి కోసం వెళ్లినవారే. అయితే విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. మరి వారి నుంచి ఈ పథకానికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.