
Delhi Liquor Scam
Delhi Liquor Scam: దేశ రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే ఈ కేసులో రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ నేతలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష తెలుగుదేశం గాని, బిజెపి గాని విమర్శలు చేయకపోవడం, కనీసం ఆ కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే లిక్కర్ స్కాం వ్యవహారంలో పాత్ర ఉందన్న ఉద్దేశంతో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ అక్కడ రాజకీయ పార్టీలు పెద్ద దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, బిఆర్ఎస్ లక్ష్యంగా బిజెపి పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తోంది. ఇప్పటికే విమర్శ, ప్రతి విమర్శలతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఏపీలో గప్ చుప్..
ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల బంధువులు పాత్ర ఉందని స్పష్టంగా తేలింది. అధికార పార్టీలో నెంబర్ టూ గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి జైళ్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి నోటీసులు అందాయి. అయితే ఈ వ్యవహారంపై ఇక్కడ ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఇసుమంతైన విమర్శ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చిని అంశంగా మారింది.
మౌనానికి కారణం అదేనా..
రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగస్వాములైనప్పటికీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ, రాష్ట్ర బిజెపి నేతలు కానీ విమర్శలు చేయకపోవడం వెనక ముఖ్య కారణాలను రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయినా రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి టిడిపిలో చేరతారని, టిడిపి నుంచే పోటీ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆ ఉద్దేశంతోనే టిడిపి ఈ కేసు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది.

Delhi Liquor Scam
ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కాంపై విమర్శలు చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి తో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు చేయాల్సి వస్తుంది. అదే గనుక చేస్తే భవిష్యత్తులో టిడిపిలో చేరబోయే ఆయనకు అడ్డంకులు సృష్టించినట్లు అవుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఒంగోలు, నెల్లూరు జిల్లాలో బలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండడంతో వారి చేరికను టిడిపి స్వాగతిస్తుంది. నేపథ్యంలోనే ప్రణాళిక ప్రకారమే ఢిల్లీ లిక్కర్ స్కాం ను పట్టించుకోనట్టు వ్యవహరిస్తోంది. ఇక తెలంగాణ మాదిరిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై ఏపీ బీజేపీ స్పీడ్ పెంచకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ పెద్దలతో రాష్ట్ర బిజెపి నాయకులకు ఉన్న సత్సంబంధాల వల్లే గట్టిగా పోరాటం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అటు ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలను కుదిపేస్తుంటే.. ఈ వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల ప్రమేయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కనీసం చర్చకు అవకాశం లేకుండా చేయడం ద్వారా రాజకీయాల్లో సరికొత్త చర్చకు ఆయా పార్టీలు దోహదం చేస్తున్నాయి.