Vijayasai Reddy: విజయసాయిరెడ్డికే మళ్లీ వైసీపీ బాధ్యతలు.. జగన్ ట్విస్ట్
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తలలో నాలుకగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తో పాటు పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను చూసేవారు.

Vijayasai Reddy: నిత్యం అధినేత వెంటే. ఏ కార్యమైనా ఆయన హితమే. ఆయన కష్టంలో ఉంటే చూడలేకపోయేవారు. సమస్యల్లో ఉంటే తట్టుకోలేకపోయేవారు. ట్రబుల్ షూటర్ గా ఎంటరై ఇట్టే పరిష్కార మార్గం చూపేవారు. అధినేత ఇచ్చే టాస్క్ లో భాగంగా అవసరమైతే ఎంతటి వారిపైనైనా ఎదురు తిరిగేవారు. లేకుంటే సగిలా పడేవారు. అంతటి వ్యక్తిని చేజేతులా దూరం చేసుకోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పడదే వ్యక్తి అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. దీంతో ఆ వ్యక్తిని తిరిగి తెచ్చుకునేందుకు సదరు అధినేత పావులు కదుపుతున్నారు. అధినేత జగన్ కాగా.. ఆ వ్యక్తి వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి.
ఆ కుటుంబంపై విధేయత..
వైఎస్ కుటుంబ కంపెనీలకు ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి జగన్ కు వీరవిధేయుడు. వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ తో పాటు విజయసాయి కేసుల్లో చిక్కుకున్నారు. జగన్ తో పాటు జైలు జీవితం గడిపారు. వైసీపీ ఆవిర్భావంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో కష్టపడ్డారు. గత ఎన్నికల ముందు టీడీపీని పక్కకు తప్పించి మోదీ సర్కారుతో వైసీపీకి సంధి లో ఆయనదే కీలక పాత్ర. వైసీపీ జాతీయ వ్యవహారాలన్ని విజయసాయి కనుసన్నల్లో నడిచేవి. దీంతో బీజేపీతో చిరకాల స్నేహం కొనసాగడం వెనుక ఆయన వ్యూహాలున్నాయి.
సజ్జల ఎంట్రీతో..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తలలో నాలుకగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తో పాటు పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను చూసేవారు. చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అయితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటర్ కావడంతో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గింది.ఆయన్ను ఒక్కో బాధ్యత నుంచి తప్పిస్తూ వచ్చారు. తొలుత విశాఖ రీజనల్ ఇన్ చార్జీ బాధ్యత నుంచి తప్పించారు. ఆ పోస్టులో వైవీ సుబ్బారెడ్డికి నియమించారు. సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిని తొలగించి సజ్జల కుమారుడికి అప్పగించారు. దీంతో విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు.
వరుస పరిణామాలతో..
గత కొన్నిరోజులుగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్నారు. అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా చూడడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించలేదు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సమయంలో సైతం ఏం మాట్లాడలేదు. దీంతో పార్టీకి విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందన్న టాక్ నడిచింది. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలను కూడా పూర్తిగా తగ్గించేశారు. ప్రస్తుతం ఢిల్లీకే పరిమితమయ్యారు. అయితే వైసీపీలో ఇటీవల పరిణామాలు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు ఎమ్మెల్యేల ధిక్కార స్వరం నుంచి బాలినేని ఎపిసోడ్ లను డీల్ చేయడంలో సలహాదారు సజ్జల ఫెయిలైనట్టు జగన్ భావిస్తున్నారు. అందుకే తిరిగి విజయసాయిరెడ్డిని పిలిపించే పనిలో ఉన్నట్టు సమాచారం. అయితే అధినేత వైఖరి తెలుసుకున్న విజయసాయి మునుపటి అంత యాక్టివ్ గా పనిచేసే చాన్స్ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
