YCP Jayaho BC Sabha: జయహో బీసీ సభ.. బీసీలే వెన్నెముక అన్న నినాదంతో విజయవాడలో బీసీ గర్జనకు వైసీపీ సర్కారు పిలుపునిచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా జన సమీకరణ చేసింది. ఆర్టీసీ బస్సులను దారిమళ్లించి మరీ జనాలను విజయవాడ చేర్చింది. ప్రజా రవాణా స్తంభించినా పెడచెవిన పెట్టింది. ప్రతీ జిల్లా నుంచి వంద బస్సులు తగ్గకుండా కేటాయించింది. మంగళవారం ఉదయం నుంచే ఈ బస్సులు బయలుదేరాయి. మంగళవారం రాత్రికే విజయవాడకు క్యూకట్టాయి. అప్పటివరకూ దారి ఖర్చులు లోకల్ వైసీపీ నేతలే భరించినా.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనాల బాధ్యతను సర్కారే తీసుకుంది. ఒక్కొక్కరికి వేల రూపాయలు ఖర్చు చేసి ‘మర్యాద’ అంటే ఏమిటో చూపిస్తామన్నట్టు విజయవాడలో వైసీపీ సర్కారు ఏర్పాట్లు చేసింది.

YCP Jayaho BC Sabha
‘కడుపు నిండా … కరువు తీరా టిఫిన్, భోజనం’తో బీసీ గర్జనను సక్సెస్ చేసేందుకు వైసీపీ సర్కారు నిర్ణయించినట్టుంది. అందుకే పసందైన విందు భోజనాలను సిద్ధం చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న వైసీపీ శ్రేణులకు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం వరకూ వారు నచ్చీ..మెచ్చే ఆహారం పెట్టేందుకు భారీగానే ఖర్చు చేస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక మెనూ రూపొందించింది. జిల్లాల వారీగా వచ్చే వారి కోసం ప్రత్యేక టెంట్లు, శిబిరాలు ఏర్పాటుచేసి ప్రతిఒక్కరికీ అందే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. బాధ్యతలను కీలక నేతలకు అప్పగించింది. ముందస్తుగానే మెనూ ప్రకటించి వైసీపీ శ్రేణులకు సమాచారమందించింది. సోషల్ మీడియాతో పాటు పార్టీ గ్రూపుల్లో కూడా విషయాన్ని తెలియజేసింది. విందు అంటే బీసీ గర్జన గుర్తుకొచ్చేలా, వైసీపీ శ్రేణులు మెచ్చేలా ఫుడ్ మెనూ రూపొందించింది.
టిఫిన్ కు సంబంధించి టీ, కాఫీతో 9 రకాల మెనూను సిద్ధం చేశారు. ఇడ్లీ, గారె, మసాల ఉప్మా, పొంగళి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమాట చట్నీ, స్వీట్, రవ్వకేసరి..ఇది అల్పాహార మెను.. ఇక మధ్యాహ్నం భోజనం విషయానికి వచ్చేసరికి..మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ,వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగళి.. ఇవీ నాన్ వెజ్ ఐటమ్స్, ఇక వెజ్ ఐటమ్స్ విషయానికి వచ్చేసరికి.. పనసకాయ్ థమ్ వెజ్ బిర్యానీ, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, పప్పు టమోటా, గోంగూర పచ్చడి, వైట్ రైస్, సాంబారు, పెరుగు, చక్కెర పొంగళి స్వీట్. ఇక లక్షల వాటర్ బాటిళ్లను సిద్ధంచేసింది.

YCP Jayaho BC Sabha
కనీవినీ ఏర్పాట్లతో బీసీల మనసు గెలుచుకోవాలన్న తలంపులతో జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారే కీలకంగా మారడంతో ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే కాపు, కమ్మలు పార్టీకి దూరమయ్యారు. ఆది నుంచి బీసీలు టీడీపీ వెంట ఉండేవారు. గత ఎన్నికల్లో జగన్ వైపు టర్న్ అయ్యారు. కానీ మూడున్నరేళ్ల పాలనలో వారికి ప్రత్యేక ప్రయోజనాలంటూ లేవు. దీంతో ఆ వర్గంలో కొంత వ్యతిరేకత ఉంది. దానిని తగ్గించేందుకు బీసీ గర్జన కు శ్రీకారం చుట్టారు. అందుకే ఎక్కడా ఏ లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. మంగళవారం ఉదయం నాటికే మెనూ ఇదంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగంలో ఉదరగొట్టారు. ‘విజయవాడలో జయహో బీసీ సదస్సుకు విచ్చేయుచున్న అందరికీ జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఫిన్ మరియు భోజనం మెనూ… అందరికీ ప్రత్యేకమైన టెంట్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాట్లు జరుగుచున్నవి’ … జై జగన్ అన్న సమాచారం ప్రతీ వైసీపీ కార్యకర్తకు చేరింది. మొత్తానికైతే గర్జనలో ఆహారానికే కోట్లాది రూపాయలను జగన్ సర్కారు కేటాయించిందన్న మాట.