Chandrababu Arrest: చంద్రబాబే కాదు.. ఆయనకు మద్దతు తెలిపినా టార్గెట్టే
పక్క రాష్ట్రం తెలంగాణలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇది వైసీపీ సర్కార్ కు కంటగింపుగా మారింది.

Chandrababu Arrest: చంద్రబాబునే కాదు.. ఆయనకు మద్దతు తెలుపుతున్న వారిని వైసిపి వెంటాడుతూనే ఉంది. మొన్నటికి మొన్న మెఘా కంపెనీ గౌరవ సలహాదారుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ను ఉద్వాసన పలికినట్లు వార్తలు వచ్చాయి. తనంతట తాను రాజీనామా చేసినట్లు రమేష్ చెబుతున్న.. వైసిపి సర్కార్ ఒత్తిడితో కంపెనీ ఆయన్ను విధులనుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో కీలక అధికారిగా పనిచేసిన రమేష్.. తాజాగా టిడిపి అనుకూల మీడియాలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అనుకూల వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
పక్క రాష్ట్రం తెలంగాణలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇది వైసీపీ సర్కార్ కు కంటగింపుగా మారింది. తెలంగాణ సర్కార్ ద్వారా సంబంధిత ఐటీ కంపెనీలకు పై ఒత్తిడి పెంచింది. దీంతో సంబంధిత ఐటి యాజమాన్యాలు నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. మరోసారి ఇటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించాయి.అయితే బెంగళూరులో మాత్రం ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతు తెలిపినా ఏం చేయలేకపోయారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడమే కారణం.
తాజాగా చంద్రబాబు కేసులో.. ఆయన తరుపున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ్ లూధ్ర ను సైతం వైసీపీ నేతలు వదల్లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సిద్ధార్థ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టులో బలమైన వాదనలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. అయినా సరే చంద్రబాబుకు విముక్తి లభించలేదు. కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. ” అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో లేకుంటే ఇక కత్తి పట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం”.. అంటూ గురు గోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావిస్తూ లాయర్ సిద్ధార్థ్ లూధ్ర ట్విట్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయుధాలు ఇచ్చి పోరాడండి అని ప్రోత్సహించేలా ఉందని రాజమండ్రి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత రౌతు సూర్యప్రకాశరావు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. అయితే కేసు నమోదుకు ఉన్న సాధ్యసాధ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబునే కాదు.. ఆయనకు మద్దతు తెలుపుతున్న వారిపై సైతం టార్గెట్ చేస్తున్నారు.
