MP Gorantla Madhav Issue: దూకుడుగా వ్యవహరించే నేతలను వైసీపీ అక్కున చేర్చుకుంటుందన్న పేరు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంపీ దివాకర్ రెడ్డిపై మీషం మెలేసిన సీఐ గోరంట్ల మాధవ్ కు రాజకీయ ఉన్నతిని కల్పించింది. ఏకంగా హిందూపురం ఎంపీ టిక్కెట్ ను కట్టబెట్టి గెలిపించింది. అప్పటివరకూ మాధవ్ ఒక పోలీస్ ఉద్యోగి మాత్రమే. ఆర్థిక, అండ బలమంటూ ఏదీ లేదు. కేవలం జగన్ ఫొటో పెట్టుకొని గెలివగలిగారు. కానీ ఎంపీ అయిన తరువాత మాత్రం తన ప్రతాపం చూపారు. తన పాత పోలీస్ వాసన మాత్రం మరువలేదు. విపక్షాలపై దూకుడుగా వ్యవహరించారు. అయినదానికి కానిదానికి నోరు పారేసుకునేవారు. అటు సొంత పార్టీలో సైతం బాధితులున్నారంటే ఆయన దూకుడు ఏ స్థాయిదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి దూకుడుతో ఇప్పుడు తన మీదకు తెచ్చుకున్నారు. న్యూడ్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యారు. సభ్యసమాజంలో ఓ నిందితుడిగా నిలబడ్డారు.

MP Gorantla Madhav
ఉపేక్ష ఎందుకో?
ప్రజలు అవినీతి ఆరోపణలను, హత్యా రాజకీయాలను మన్నించిన సందర్భాలున్నాయి. కానీ ఇటువంటి చేష్టలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన్నించరు. అయితే వైసీపీ పెద్దలకు ఇది తెలియంది కాదు కానీ.. గోరంట్ల మాధవ్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనేదో బలమైన నేత కారు. వర్గం లేదు… సామాజిక బలమూ లేదు. అయినా ఎందుకో ఉపేక్షిస్తున్నారు. అయితే చర్యల్లో ఎంత జాప్యం జరిగితే వైసీపీకి అంత మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు సొంత పార్టీలో సైతం విషయంలో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Chandrababu- BJP: చంద్రబాబుకు బీజేపీ స్నేహహస్తం.. మొత్తబడుతున్న కేంద్ర పెద్దలు
నాడు జెట్ స్పీడుగా..
మాజీ డ్రైవర్ హత్య కేసుల్లో ఎమ్మెల్సీ అనంత్ బాబుపై వైసీపీ అధిష్టానం జెట్ స్పీడుగా వ్యవహరించింది. పార్టీ నుంచి సస్పెన్షన్ తో పాటు కేసు నమోదుచేసి ఆయన్ను కటకటాలపాలుచేసింది. అయితే మృతుడు ఎస్సీవర్గానికి చెందిన వాడు కావడంతో వేగంగా స్పందించిందన్న వ్యాఖ్యలైతే వినిపించాయి. ఎలాగైతేనేం వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వేగంగానే స్పందించింది. అటు తరువాత రోడ్డు కాంట్రక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టారని ఆరోపణలు రావడంతో సీఎం జగన్ కుటుంబసభ్యుడు వైఎస్ కొండా రెడ్డిని చకచకా అరెస్ట్ చేశారు. కేసు నమోదుచేశారు. అంతటితో ఆగకుండా జిల్లా బహిష్కరణ వేటు వేశారు.

MP Gorantla Madhav Issue
ముందే వేటు వేసి ఉంటే…
కానీ గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ పెద్దలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఆయనపై అభియోగాలు రావడంతో తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రమే చెబుతున్నారు. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో వచ్చినవి కూడా అభియోగాలు మాత్రమే. ఎక్కడా నిరూపితం కాలేదు. అయినా ఆయన విషయంలో శరవేగంగా స్పందించి కేసు నమోదుచేశారు. అరెస్ట్ లు చేశారు. కానీ మాధవ్ విషయంలో మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండాలి. ఆయన సచ్ఛీలత నిరూపించుకున్నాక తిరిగి పార్టీలో చేర్చుకుంటామని ప్రకటన చేసి ఉంటే వివాదాలకు ఫుల్ స్టాప్ పడేది. కానీ వైసీపీ పెద్దలు భిన్నంగా ఆలోచించారు. టీడీపీకి ఆయుధాన్ని ఏరికోరి ఇచ్చినట్టయ్యింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసిన తాత్సారం మున్ముందు వైసీపీ భారీ మూల్కం చెల్లించుకునే అవకాశమైతే ఉంది.