Peoples Pulse Survey: ప్రతిపక్షాల పొత్తు అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును గంపగుత్తగా ప్రతిపక్షాల వైపు మళ్లించనుంది. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో వార్ వన్ సైడ్ అవుతోందని తెలుస్తోంది. ఓ సర్వే రిపోర్టు షాకింగ్ విషయాలను వెల్లడిస్తోంది. 2024లో అధికార పార్టీ దారి ఇంటికే అని స్పష్టమవుతోంది.

Peoples Pulse Survey
ఎన్నికలు సమీపించే కొద్దీ సర్వేల సందడి మొదలవుతుంది. కానీ వైసీపీ మాత్రం ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ సంస్థతో సర్వే కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఐప్యాక్ సంస్థ ఊరూరా తిరిగి శాంపిల్స్ సేకరిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థకు వైసీపీ భవితవ్యం పై ఓ ఐడియా వచ్చేసింది. ఇక ఏపీలో మరో స్వతంత్ర సంస్థ సర్వే నిర్వహించింది. జర్నలిస్టు దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలోని పీపుల్స్ పల్స్ సంస్థ పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది. ఏపీలోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఫస్ట్ ట్రాకర్ పోల్ పేరిట సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.
జనవరి 16 నుంచి 21 మధ్య కాలంలో 35 పోలింగ్ స్టేషన్ల నుంచి 700 శాంపిల్స్ సేకరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20 శాంపిల్స్ సేకరించారు. ఇందులో 57 శాతం పురుషులు, 43 శాతం మహిళలు ఉన్నారు. రంపచోడవరం, అరకు, పాడేరు, కురుపాం, సాలూరు, పాలకొండ, పోలవరం నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో పోలవరం టీడీపీకి అనుకూలంగా ఉంటే మిగిలిన ఆరు నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు సర్వే రిపోర్టులో వెల్లడించారు. మొత్తం మీద వైసీపీకి 44.25 శాతం, టీడీపీకి 39.39 శాతం, జనసేనకు 8.19 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని రిపోర్టులో తేలింది.

Peoples Pulse Survey
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం వైసీపీకే ఆధిక్యం ఉన్నప్పటికీ..ప్రతిపక్షాలు పొత్తు పెట్టుకుంటే సీన్ రివర్స్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే ఆ విషయాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైతే వైసీపీకి భారీ నష్టం చేకూరుతుంది. సర్వేలో టీడీపీకి 39.9 శాతం, జనసేనకు 8.19 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 47.58 శాతం ఓట్లు ఖాతాలో పడతాయి. అప్పుడు వైసీపీకి 44.25 శాతం ఓట్లు, టీడీపీ, జనసేన కూటమికి 47.58 శాతం ఓట్లు వస్తాయి. వైసీపీ ఓటమికి జనసేన ప్రధానంగా కారణమవుతుంది. జనసేన ఓట్లు టీడీపీతో కలిస్తే తిరుగులేని మెజార్టీ ఆ రెండు పార్టీల సొంతమవుతుంది. ఈ విషయం వైసీపీ పెద్దలకు ముందే తెలుసు కాబట్టి జనసేన, టీడీపీ పొత్తు పై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఎలాగైనా పొత్తులేకుండా చేయగలిగితే అధికారం మళ్లీ వైసీపీదే అని జగన్ భావిస్తున్నారు.