Writer Movie Review : జై భీమ్ తర్వాత నన్ను ఆకట్టుకున్న సినిమా రైటర్..ఈ సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగదు. రంగరాజు (సముద్రఖని) అనే నిజాయతీగల పోలీస్ కానిస్టేబుల్( రైటర్)తో ట్రావెల్ చేసినట్లే ఉంటుంది. పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి ఉద్యోగుల పట్ల పై అధికారుల ప్రవర్తన ఎలా ఉంటదో రంగరాజు క్యారెక్టర్ మనకు తెలియజేస్తుంటుంది. కిందిస్థాయి పోలీసు హక్కుల కోసం యూనియన్ ఉండాలని రంగరాజు పోరాటం చేస్తాడు. పై అధికారుల కోపం వచ్చి దూరంగా బదిలీ చేస్తారు. ఇద్దరు భార్యలతో హాయిగా ఉండే రంగరాజు మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ ఉండి కూడా భారమైన మనసుతో బదిలీ అవుతాడు. ఓ లాడ్జీలో ఉంటూ ఉద్యోగం చేద్దామనుకుంటడు. అక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది..
రంగరాజుకు లాడ్జీలో ఓ యువకుడికి పహారా కాసే డ్యూటీ వేస్తారు. లాడ్జీలో డ్యూటేంటి.. ఆ యువకుడు దేవ కుమార్ (హరి కృష్ణన్) చేసిన తప్పేంటి తెలుసుకునేందుకు రంగరాజు ప్రయత్నిస్తడు. దేవ కుమార్ పీహెచ్‌డీ స్టూడెంట్. ఆంధ్ర యూనివర్సిటీలో సోషియాలజీలో పీహెచ్‌డీ చేస్తుంటడు. ఇందులో భాగంగా సమాచారం కోసం ఆర్‌టీఐకి అప్లై చేసుకుంటడు. అదే అతడు చేసిన నేరం. అతడిపై డీసీపీ కక్ష గడుతడు. నక్సల్స్‌తో సంబంధాలు అంటగట్టి లోపలేయాలని చూస్తడు. ఈ అక్రమ కేసులో తనకు తెలియకుండానే రంగరాజు భాగస్వామి అయితడు. రిటైర్మెంట్ చివరి రోజుల్లో ఓ అమాయకుడు తనవల్ల ఇబ్బంది పడుతుంటే రంగరాజు తట్టుకోలేకపోతడు. మరి రంగరాజు దేవకుమార్‌ను కాపాడాడా? నిజాయతీగా ఉద్యోగం చేసి, చివరి రోజుల్లో గిల్టీ ఫీలింగ్ కలిగే పని చేసినందుకు ఏం చేశాడు? అనేది మీరు సినిమాలోనే చూడాలి..
ఈ సినిమాను పా రంజిత్ నిర్మించగా, ఫ్రాంక్లిన్ జాకబ్ అద్భుతంగా తెరకెక్కించిండు. ఈ క్రైమ్ థిల్లర్ సినిమా స్లోగా నడుస్తున్నా మనల్ని కుర్చీలకెళ్లి లేవనియ్యదు. సెకండాఫ్‌లో వచ్చే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర సినిమాకే హైలైట్. కులం కారణంగా ఆమెను హార్స్ రైడింగ్ విభాగంలో ఉద్యోగానికి డీసీపీ నిరాకరిస్తాడు. డీసీపీ జీపులో వస్తుండగా ఆ లేడీ కానిస్టేబుల్ గుర్రంతో డీసీపీకి ఎదురెళ్లే సీన్ చూడాల్సిందే. దర్శకుడు కొత్తవాడైనా కిందిస్థాయి ఉద్యోగులపై పై అధికారుల తీరు, కులం ప్రస్తావన ఇలా ఒక్కో అంశాన్ని ప్రస్తావించడం బాగుంది..
చివరగా ఈ సినిమా చూడాలంటే ఓపికుండాలి.. ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు చూడండి..నచ్చకుంటే నన్ను తిట్టుకోకండి..
-రాజు అతికం