Site icon OkTelugu

West Asia War Fuel Crisis: పశ్చిమాసియా యుద్ధం.. ఇంధన సంక్షోభానికి కేంద్రం చెక్‌!

West Asia War Fuel Crisis

West Asia War Fuel Crisis

West Asia War Fuel Crisis: పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు.. హర్మూజ్‌ ఎప్పుడు తెరుచుకుంటుందో అర్థం కావడం లేదు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా దిగుమతిపై ఆధారపడిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతోపాటు యురోపియన్‌ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. భారత్‌లో గ్యాస్, చమురు ధరలను కేంద్రం పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో చమురు సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర ఇంధన నిల్వల సామర్థ్యాన్ని 50 శాతం పెంచబోతోంది. ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉండగా, వాటిని 90 రోజుల వరకు పెంచే దిశగా అడుగులేస్తోంది. ఆయిల్‌ కంపెనీలను ఫ్యూయల్‌ కెపాసిటీని పెంచుకోవాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.

దిగుమతులే ఆధారం..
దేశంలోని మొత్తం ఇంధన అవసరాల్లో సుమారు 90 శాతం విదేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతోంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి ఎక్కువగా చమురు వస్తోంది. ఆ ప్రాంతంలో ఏర్పడిన సంక్షోభం వల్ల సరఫరా చైన్‌ దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగం, పరిశ్రమలు దెబ్బతినకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం..
ఇంధన నిల్వలను పెంచడం అనేది కేవలం నిల్వల సామర్థ్యం పెంచడం మాత్రమే కాదు. ఇది దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే వ్యూహాత్మక చర్య. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అలాంటి సమయంలో దేశంలో తగినంత నిల్వలు ఉంటే, ధరలు ఎక్కువగా పెరగకుండా నియంత్రించవచ్చు. అలాగే రవాణా రంగం, వ్యవసాయం, పరిశ్రమలు అంతరాయం లేకుండా కొనసాగవచ్చు. దీర్ఘకాలికంగా చూస్తే ఈ చర్య ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. అయితే నిల్వలు పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నిల్వ ఖర్చులు భారీగా ఉంటాయి. ఆయిల్‌ కంపెనీలపై ఈ భారాన్ని ఎలా పంచాలనేది కూడా ముఖ్యమైన అంశం.

ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో..
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పుడు చమురు సరఫరా ఎప్పుడైనా ప్రభావితం కావచ్చు. భారతదేశం వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఇది పెద్ద సవాల్‌. అందుకే ప్రభుత్వం ముందస్తుగా నిల్వలు పెంచి, సంక్షోభం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ చర్య ద్వారా దేశం ఆకస్మిక సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన భద్రతపై దృష్టి పెట్టిన ఇతర దేశాలతో సమానంగా భారతదేశం కూడా అడుగులేస్తోంది. దీర్ఘకాలంలో ఇంధన వైవిధ్యీకరణవైపు కూడా అడుగులేయడం మరింత మంచిదని నిపుణుల అభిప్రాయం.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన నిల్వలను 50 శాతం పెంచే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశ ఇంధన భద్రతకు ముఖ్యమైన అడుగు. 60 రోజుల నుంచి 90 రోజులకు నిల్వలు పెంచడం ద్వారా ఆకస్మిక సరఫరా అంతరాయాలను ఎదుర్కోవచ్చు. ఈ చర్య ఆర్థిక స్థిరత్వం, ధరల నియంత్రణ మరియు దేశ భద్రతకు దోహదపడుతుంది.

Exit mobile version