Site icon OkTelugu

US Iran War Latest Updates 2026: యుద్ధం నల్లేరుమీద నడక కాదు.. పల్లేరుమీద పడక.. అమెరికా అంచనాలు తలకిందులు!

US Iran War Latest Updates 2026

US Iran War Latest Updates 2026

US Iran War Latest Updates 2026: ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్‌పై సైనిక చర్య మొదలు పెట్టింది. ఇజ్రాయెల్‌తో కలిసి బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిసింది. మరుసటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను చంపేశాయి. దీంతో యుద్ధం ఇక నల్లేరుమీద నడక అనుకుంది అమెరికా.. కానీ నెల రోజుల తర్వాత ఇది నల్దేరుమీద నడక కాదని, పల్లేరుమీద పడక అని అర్థమైంది. యుద్ధం ముళ్లు పల్లేరు కాయల్లా అగ్రరాజ్యాన్ని గుచ్చుకుంటున్నాయి. ఇరాన్‌ సైనిక శక్తి, వ్యూహాత్మక దాడులు అమెరికాను చిక్కుల్లోకి నెట్టాయి. యుద్ధం నుంచి బయటపడేందుకు వాషింగ్టన్‌ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా భూసేనల మోహరింపుకు సిద్ధమవుతోంది. కానీ ఇది యుద్ధాన్ని మరింత పొడిగించే ప్రమాదం ఉంది.

ల్యాండ్‌ ఆర్మీ మోహరింపు..
అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు పది వేల మంది ల్యాండ్‌ ఆర్మీని ఇరాన్‌ చుట్టూ మోహరించాలని నిర్ణయించింది. మొదటి బృందాలు అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని దాటి గల్ఫ్‌ వైపు ప్రయాణిస్తున్నాయి. రెండు రోజుల్లో మోహరింపు పూర్తవుతుందని అంచనా. కానీ ఇరాన్‌ను పూర్తిస్థాయిలో ఆక్రమించడం కాకుండా కేవలం నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు, ఖర్గ్‌ ద్వీపం వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం మాత్రమే ఉద్దేశం. అయినా పూర్తి ఆక్రమణకు 2–3 ఏళ్లు పడుతుందని, అంత సుదీర్ఘ యుద్ధాన్ని భరించే ఓపిక అమెరికన్‌ ప్రజలకు లేదని పెంటగాన్‌ అంచనా వేసింది.

బయటకు రాని నిజాలు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో భారత్‌కు చెందిన 5–6 విమానాలు కూలిపోయాయని ఆరోపించిన ట్రంప్, ఇరాన్‌ యుద్ధంలో 22 యుద్ధ విమానాలు కూలిపోయిన విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. అత్యాధునిక ఎఫ్‌–35 స్టెల్త్‌ విమానాలు కూడా ఇరాన్‌ వాయురక్షణ వ్యవస్థలకు బలయ్యాయని సమాచారం. అమెరికా సైనికులు పట్టుబడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అమెరికా అధికారికంగా ‘విమానాలు కూలలేదు‘ అని బుకాయిస్తోంది. పైలట్ల కోసం మాత్రం వెతుకుతున్నట్లు చెబుతోంది. 24 గంటల్లోనే నాలుగు విమానాలు కూలిపోయాయని, దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి.

బలంగా ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌..
ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం అమెరికాకు చుక్కలు చూపుతోంది. రష్యా, చైనా నుంచి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్‌కు అందాయని ప్రచారం జరుగుతోంది. దీంతో అమెరికా దాడులను ఇరాన్‌ సమర్థవంతంగా తట్టుకుంటోంది. హెలికాప్టర్లపై కూడా ఇరాన్‌ దాడులు చేసింది. యుద్ధ పరిధి విస్తృతమయ్యే అవకాశం ఉంది. హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ పట్టు సడలడం లేదు. చమురు సరఫరాకు ముప్పు కొనసాగుతోంది.

డబ్ల్యూహెచ్‌వో నివేదిక..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) యుద్ధంపై విడుదల చేసిన గణాంకాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని దేశాల్లో కలిపి 3,300 మంది మరణించారు. మరో 30 వేల మంది గాయపడ్డారు. ఇక యుద్ధం నేపథ్యంలో 43 లక్షల మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. యుద్ధం నేపథ్యంలో 116 ఆస్పత్రులపైనా దాడులు జరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ సంఖ్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

సుదీర్ఘ యుద్ధంతో ట్రంప్‌కు ముప్పే..
అమెరికా ల్యాండ్‌ ఆర్మీ మోహరించిన తర్వాత కూడా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అగ్రరాజ్యానికి ఇబ్బందులు తప్పవు. యుద్ధంలో ఇరాన్‌ సేలను అమెరికా సైనికులను చంపి వాటిని అమెరికాకు పంపితే.. అక్కడి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెగడం ఖాయం. ఇప్పటికే యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సైనికుల శవాలు వస్తే ట్రంప్‌ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే.

గౌరవప్రదమైన ఎగ్జిట్‌ అవసరం..
నిపుణులు అమెరికాకు ఒక్కటే సలహా ఇస్తున్నారు యథాశక్తి త్వరగా యుద్ధం నుంచి బయటపడాలి. కానీ అది గౌరవప్రదమైన ఎగ్జిట్‌ కావాలి. అంటే ఓటమిని అంగీకరించకుండా, కొన్ని లక్ష్యాలను సాధించినట్లు చూపిస్తూ, కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలి. లేకపోతే అమెరికా ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో అమెరికా డాలర్‌ బలహీనపడుతుంది. అమెరికాపై ప్రపంచ దేశాలకు నమ్మకం పోతుంది. దీంతో అగ్రరాజ్యం పరువు పోతుంది.

ఇరాన్‌ యుద్ధం అమెరికాకు చుక్కలు చూపుతోంది. భూసేనల మోహరింపు యుద్ధాన్ని పొడిగించే ప్రమాదం ఉంది. అమెరికా సైనికుల మరణాలు పెరిగితే ట్రంప్‌ ప్రభుత్వం పతనం అనివార్యం. ఇరాన్‌ వాయురక్షణ వ్యవస్థ అమెరికాకు షాక్‌ ఇస్తోంది. దౌత్య మార్గాలు మూసుకుపోతున్నాయి. అమెరికా ముందు రెండే మార్గాలు ఉన్నాయి. గౌరవప్రదమైన ఎగ్జిట్‌ లేదా ఓటమిని అంగీకరించడం. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది.

Exit mobile version