Site icon OkTelugu

UAE Exits OPEC: ఒపెక్‌ నుంచి వైదొలిగిన యూఏఈ.. గల్ఫ్‌లో కొత్త గేమ్‌!

UAE Exits OPEC

UAE Exits OPEC

UAE Exits OPEC: ప్రపంచంలో ఇంతకాలం చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలన్ని ఒక సంస్థగా ఉన్నాయి. ఒపెక్‌గా కొనసాగుతున్నాయి. చమురు ధరలను, ఎగుమతి, రక్షణను కలిసికట్టుగా నిర్ణయిస్తున్నాయి. అయితే ఇరాన్‌–అమెరికా యుద్ధం ఈ ఓపెక్‌ దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్‌ ఒపెక్‌ దేశాల్లో కీలకమైన గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయడం, హర్మూజ్‌ జలసంధి మూసివేసి చమురు రవాణాకు ఆటంకం కలిగించడంతో గల్ఫ్‌దేశాలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఒపెక్‌లో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం యూఏఈ తన సభ్యత్వాన్ని వదులుకుంది. కూటమి విధించిన ఉత్పత్తి పరిమితుల వల్ల తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడం, ఇరాన్‌ దాడులు, హర్మూజ్‌ జలసంధి ఆటంకాలు నిష్క్రమణకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ నిర్ణయం ప్రపంచ చమురు విపణిని ఊపందుకునేలా చేస్తుంది. సౌదీ ఆధిపత్యం బలహీనపడి, ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్‌ వంటి దిగుమతి ఆధార దేశాలకు ఇది ఆర్థిక ఊరటగా మారవచ్చు, కానీ తాత్కాలిక అస్థిరతలు తప్పవు.

నిష్క్రమణ వెనుక కారణాలు
ఒపెక్‌లో సౌదీ అరేబియా ప్రభావం కారణంగా యూఏఈ ఉత్పత్తి పెంపును అడ్డుకున్నారు. కూటమి నియమాలు సభ్య దేశాల స్వేచ్ఛను పరిమితం చేస్తూ, ధరలు నియంత్రించేందుకు పనిచేస్తున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం చేశాయి. రువైస్‌ రిఫైనరీ, పుజైరా పోర్టు, హబ్షాన్‌ గ్యాస్‌ క్షేత్రాలపై 2200 డ్రోన్‌లు, క్షిపణుల దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన యూఏఈకి ఇరాన్‌లో ఒపెక్‌ సభ్యత్వం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో స్వతంత్రంగా ఉత్పత్తి, ఎగుమతి నిర్ణయాలు తీసుకునేందుకు ఓపెక్‌ నుంచి వైదొలిగింది.

ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం
కూటమి బలహీనపడటంతో మార్కెట్‌లో అస్థిరత తలెత్తవచ్చు. యూఏఈ స్వేచ్ఛగా ఉత్పత్తి పెంచితే సరఫరా భారీగా పెరిగి ధరలు పడిపోతాయి. సౌదీ అరేబియా ధరలు కాపాడేందుకు మరిన్ని కట్టుబాట్లు విధించవచ్చు. ఇరాన్‌ హర్మూజ్‌ మూసివేత బెదిరింపు మధ్య యూఏఈ పైప్‌లైన్‌ల ద్వారా ఒమాన్‌లోని పుజైరా పోర్టుకు చమురు తరలిస్తే, జలసంధి ఆధారపడటం తగ్గుతుంది. ఇది ప్రపంచ వాణిజ్యానికి మేలు చేస్తుంది, కానీ కొన్ని నెలలు ధరల ఊగిసలాగాలు కొనసాగుతాయి.

భారత్‌కు ప్రయోజనం..
భారత్‌ రోజుకు 58 లక్షల బ్యారెళ్ల చమురు వాడుకుంటుంది, 85% దిగుమతులపై ఆధారపడుతుంది. యూఏఈ నుంచి రోజువారీ 6.2 లక్షల బ్యారెళ్లు ఇప్పటికే వస్తున్నాయి. ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గి, దిగుమతి ఖర్చు ఆదా అవుతుంది. హర్మూజ్‌ ఆటంకాలు ఉన్నప్పుడు పుజైరా మార్గం ద్వారా సురక్షిత దిగుమతులు సాధ్యం. 1.5 మిలియన్‌ బ్యారెళ్లు రోజుకు రవాణా చేసే పైప్‌లైన్‌ దీనికి దోహదపడుతుంది. యూఏఈతో బలమైన సంబంధాల వల్ల మనం ప్రాధాన్యత పొందుతాము. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరట, కానీ ధరల అస్థిరతను ఎదుర్కొనాలి.

యూఏఈ నిష్క్రమణ ఒపెక్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో చమురు ధరలు తగ్గుతాయి. ఇదే సమయంలో భారత్‌ వైవిధ్యమైన దిగుమతి మూలాలు, రిజర్వ్‌ నిల్వలు పెంచుకోవాలి. దీర్ఘకాలంలో ఇది శుభప్రదం. చమురు ధరలు తగ్గి, ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య ఈ మార్పు ప్రపంచ ఇంధన వ్యూహాలను మారుస్తుంది.

Exit mobile version