UN Security Council: ఫలిస్తున్న ప్రయత్నాలు.. భారత్‌కు మద్దతుగా అగ్ర దేశాలు.. త్వరలో నెరవేరనున్న శాశ్వత సభ్యత్వం కల

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలన్న భారత ఆకాంక్ష త్వరలో నెరవేరే అవకాశం కనిపిస్తోంది. భారత్‌కు ప్రపంచంలో అనేక దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : September 27, 2024 2:44 pm

UN Security Council

Follow us on

UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని భారత్‌ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈమేరకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో భారత్‌ జరుపుతున్న సంప్రదింపులు.. గడిచిన పదేళ్లలో భారత్‌ సాధించిన ఆర్థిక ప్రగతి చూసి.. అనేక దేశాలు భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇటీవలే అమెరికా కూడా భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపింది. తర్వాత ఫ్రాన్స్, తాజాగా యూకే కూడా భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసపెంబ్లీ 79వ సాధారణ చర్చను ఉద్దేశించి మాట్లాడిన బ్రిటన్‌ ప్రధాని కైర్‌ స్టార్మర్‌ యూఎన్‌సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలన్నారు. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతోందని తెలిపారు. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆఫ్రికన్‌ దేశాల ప్రాతినిధ్యం కూడా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు.

ఫ్రాన్స్‌ కూడా..
ఇక అంతకు ముంద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం గురించి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మాక్రన్‌ కూడా మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు తాము మద్దతు ఇస్తామని తెలిపారు. భద్రతా మండలిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఫ్రాన్స్‌ అనుకూలంగా ఉందని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలతోపాటు జపాన్, జర్మనీ, ఇండియా, బ్రెజిల్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

అమెరికా కూడా మద్దతు..
ఇక గతవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈమేరకు భారత ప్రధాని నరేంద్రమోదీకి స్వయంగా హామీ ఇచ్చారు. మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన మోదీ.. బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు.

కీలక దేశాల మద్దతు..
ఇదిలా ఉంటే.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న మూడు కీలక దేశాలు అమెరికా, యూకే, ఫ్రాన్స్‌.. భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయంలో మద్దతు ఇవ్వడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. గతంలో ఫ్రాన్స్‌ ఒక్కటే మద్దతు ఇచ్చింది. అమెరికా, బ్రిటన్, చైనా వ్యతిరేకించాయి. ప్రస్తుతం భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి రెండేళ్లకోసం ఎన్నుకోబడతాయి. శాశ్వత సభ్య దేశాలుగా రష్యా, అమెరికా, ప్రాన్స్, యూకే, చైనా ఉన్నాయి. ఐదు దేశాల్లో నాలుగు దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఇక శాశ్వత సభ్య దేశాలకు ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది.