World Cancer Day 2023: క్యాన్సర్.. ఈ పేరు వినగానే మనలో సహజంగానే భయం. ఈ వ్యాధి సోకితే ఇక చావే అన్న అభిప్రాయం అందరిలో ఉంది. వ్యాధి వస్తే భయపడుతున్న జనం దాని నియంత్రణకు మాత్ర ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రపంచ దేశాలతో పోలిస్తే క్యాన్సర్ మన దేశంలోనే వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిసింది. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినం నేపథ్యంలో మరి ఈ వ్యాధి ఇంత వేగంగా విస్తరించడానికి కారణాలు ఏమిటి, మన జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి? వ్యాధి వస్తే తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ప్రత్యేక కథనం.

World Cancer Day 2023
క్యాన్సర్… ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికి చాలామందికి అవగాహన లేదు. ముదిరిన దశలో వ్యాధిని గుర్తించడం వల్ల పరిస్థితి చేజారుతోంది. కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి వీలుంది.
క్యాన్సర్ అంటే?
శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే, శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతీ కణం విభజనకుగురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే, శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్‌ఏతో మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక.. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాలు కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్ (కణితి)గా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు.
రెండు రకాల కణితులు..
సాధారణంగా కణితులు రెండు రకాలుగా ఏర్పడతాయి. క్యాన్సర్ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరం ఒక చోట మాత్రమే పెరుగుతుంది. తొలగించిన తర్వాత మళ్లీ రాదు. అయితే, క్యాన్సర్ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు సైతం వ్యాపిస్తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. అలసట, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, చర్మంలో గడ్డలు ఏర్పడటం, శరీరం బరువలో మార్పులు, చర్మం రంగు మారడం, దీర్ఘకాలికంగా దగ్గు వేదించడం వంటి సమస్యలను క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించవచ్చు.
మన ఆహారపు అలవాట్లే కారణం..
పెరుగుతున్న ఉరుకులు పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, మనం తీసుకునే ఆహారం క్యాన్సర్ వేగంగా వృద్ధికి కారణమవుతోంది. పని ఒత్తిడిలో పడి మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు. పూర్వం ఫ్రైలు, పిండి వంటలు పండుగల వేళ మాత్రమే తీసుకునేవారు. నిల్వ చేసే అవకాశం కూడా నాటి రోజుల్లో లేకపోవడంతో నాలుగైదు రోజుల్లోనే ఆ వంటకాలు అయిపోయేవి. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. డీప్ ఫ్రైం ఆహారం తీసుకోవడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. నిత్యం అదే ఆహారం తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో నూనె వాడే ఆహారాలతో క్యాన్సర్ ముప్పు ఎక్కువ. కానీ అవగాహన లేక మనం అదే ఆహారం తీసుకుంటున్నాం. ప్రపంచంలో ఆయిల్ వినియోగించే దేశాల్లో మనది అగ్రస్థానంలో ఉంది. ఇక నిల్వ చేసేందుకు ఫ్రిజ్‌లు అందుబాటులోకి రావడంతో ఎక్కువ రోజులు నిల్వ చేసుకుని, వేడుచేసుకుని తింటున్నాం. ఇవి కార్యన్సర్ కారక కణాలను ప్రోత్సహిస్తాయి.
జంక్ ఫుడ్..
ఇక జంక్‌ఫుడ్ వినియోగం కూడా పెరింది. చిప్స్, పిజ్జా, బర్గర్, మైదాతో తయారు చేసే ఆహారాల వినియోగం ఎక్కువైంది. ఇవి కూడా పరోక్షంగా క్యాన్సర్ కారకాలు, ఆల్కహాల్, స్మోకింగ్ కూడా పెరిగింది. సాధారణంగా దేశంలో కనిపించే బ్రెస్ట్, లంగ్, ప్రేగు క్యాన్సర్లకు ఇవే ప్రధాన కారణం. ఇవి కూడా శరీరంలో చిపోని కణాను ప్రోత్సహిస్తాయి. మన రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.
మన రక్షణ వ్యవస్థపై ప్రభావం..
మనం తినే ఆహారం.. మన రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. తిన్నా అరుగుతుంది.. శరీరం బాగానే ఉంది అన్న భావనతో ఉంటున్నారు. కానీ ఫాస్ట్‌ఫుడ్, నాసిరకం ఆహారం మన శరీరంలో పెరిగే రోగ కారకాలను రక్షణ వ్యవస్థ చంపేస్తుంది. రక్షణ వ్యవస్థ బాగుంటే వ్యాధులు దగ్గ్గరకు రావు. కానీ మనం ఆ రక్షణ వ్యవస్థనే దెబ్బతీస్తున్నాం. దీంతో క్యాన్సర్ కేసులు పెరుగుతన్నాయి.
క్యాన్సర్, రకాలు..
బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ములు)
మహిళల్లోనే ఎక్కువగా వచ్చే ఈ క్యాన్సర్.. ఇప్పుడు పురుషులనూ కలవరపెడుతోంది. రొమ్ములపై నొప్పిలేని గడ్డలు ఏర్పడినా, మార్పులు కనిపించినా తప్పకుండా అప్రమత్తం కావాలి.
స్కిన్ క్యాన్సర్(చర్మం)
చర్మంపై అసాధారణ మచ్చలు, గడ్డలు లేదా పుండ్లు ఏర్పడినట్లయితే అప్రమత్తం కావాలి. చంకల్లో గట్టి గడ్డలు లాంటివి ఏర్పడినా, చర్మంపై మీ ప్రమేయం లేకుండా దద్దుర్లు, పుట్టు మచ్చలు పెరగుతున్నా చర్మ క్యాన్సర్‌గా అనుమానించాలి. చర్మ క్యాన్సర్లు మూడు రకాలుం. అవి బాసల్ సెల్ స్కిన్ క్యాన్సర్, స్వామస్ సెల్ స్కిన్ క్యాన్సర్, మెలనోమా. బాసల్ స్కిన్ క్యాన్సర్‌ను సులువుగానే నయం చేయొచ్చు. అయితే, స్వామస్ సెల్ స్కిన్ క్యాన్సర్‌ను నయం చేయడం మాత్రం చాలా కష్టం. మెలనోమా క్యాన్సర్ ప్రమాదకరం. పుట్టుమచ్చల రంగు, ఆకారం, పరిమాణం మారడం ఈ వ్యాధి లక్షణాలు. కొత్తగా పుట్టుమచ్చలు రావడం, నొప్పి, దురద, పుట్టు మచ్చల చుట్టూ చర్మం ఎర్రగా కందిపోవడం, రక్తం కారడం లాంటి లక్షణాలు మీలో కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిందే.
లంగ్ క్యాన్సర్ (ఊపిరితిత్తులు)
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించడం కష్టం. వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు పాకిన తర్వాతే ఇది బయటపడుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు తెలిపారు. కొన్ని లక్షణాలతో ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని పేర్కొన్నారు. మాటలో అసాధారణ మార్పులు, ఛాతి నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, దగ్గు ఆగకుండా రావడం, బలంగా శ్వాస తీసుకోలేకపోవడంతోపాటు నవ్వినా, దగ్గినా నొప్పి రావడం, గురక లాంటి సమస్యలతో లంగ్ క్యాన్సర్‌ను పసిగట్టవచ్చని వివరించారు. ఈ క్యాన్సర్ ముదిరితే.. శ్వాస ఆడకపోవడం, దగ్గినప్పుడు రక్తం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తున్నప్పుడు తలనొప్పి, ఎముకల్లో నొప్పి, నీరసం, మెడ లేదా అంత కంటే పై భాగాల్లో గడ్డలు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, చర్మం, కళ్లకు ఈ వ్యాధి సంక్రమించే కొద్దీ ఆయా భాగాలు పాలిపోతాయి. ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

World Cancer Day 2023
ప్రోస్టేట్ క్యాన్సర్(మూత్రాశయం)
ప్రోస్టేట్ అంటే వీర్య గ్రంథి. ఇది వాల్‌నట్ తరహాలో ఉంటుంది. ఇదే పురుషుల్లో వీర్యాన్ని తయారు చేస్తుంది. వాస్తవానికి పురుషుల్లో క్యాన్సర్ ముప్పు చాలా తక్కువ. అయితే, ప్రోస్టేట్ క్యాన్సర్ (మూత్రాశయ క్యాన్సర్) మాత్రం తెలియకుండానే పెరిగిపోతుంది. ముందుగా ఈ గ్రంథిలోనే క్యాన్సర్ కణం ఏర్పడుతుంది. ఆలస్యం చేస్తే.. అది మిగతా భాగాలకు కూడా పాకవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కొలోన్∙లేదా రెక్టం క్యాన్సర్(పెద్ద పేగు భాగం)
కొలొరెక్టల్ క్యాన్సర్.. కొలోన్ (పెద్దపేగు)లో లేదా రెక్టం(పురీష నాళం) గానీ మొదలవుతుంది. అది పెద్ద పేగులో ఏర్పడితే కొలోన్ క్యాన్సర్ అని, పురీష నాళం వద్ద మొదలైతే రెక్టం క్యాన్సర్ అని పిలుస్తారు. ఎక్కడ స్టార్ట్ అయ్యిందన్న దాన్ని బట్టి కొలోన్ కాన్సర్, లేదా రెక్టం కాన్సర్ అని పిలుస్తారు. కొలోన్ క్యాన్సర్, రెక్టం కాన్సర్‌ను కలిపి కొలొరెక్టల్ క్యాన్సర్ అంటారు. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, సరైన ఆహారాన్ని తీసుకోకపోయినా ఈ క్యాన్సర్ వస్తుంది.
కిడ్నీ క్యాన్సర్ (మూత్రపిండాలు)
ఈ క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నవారిలో మూత్రంతోపాటు రక్తం వస్తుంది. అలసటగా అనిపిస్తుంటుంది. ఆకలి మందగిస్తుంది. కాలి మడమలు, కాళ్లు వాచిపోతాయి. బీపీ ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. జ్వరం వీడవకుండా వస్తుంటుంది. పార్వ నొప్పి లేదా వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. పక్కలు లేదా వెనుక భాగంలో గడ్డలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స పొందాలి.
బ్లడ్ క్యాన్సర్ (రక్తం)
రక్తకణాలు నియంత్రణ తప్పి అవసరం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీన్నే బ్లడ్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ సోకినవారు ఎప్పుడూ అలసటగా, నీరసంగా కనిపిస్తారు. బాధితుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల తరచు జ్వరంతో బాధపడతారు. ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవ్వుతారు. శరీరంలో ల్యూకేమియా సెల్స్ పెరుగుతాయి. దీనివల్ల రోగి నోరు, చర్మం, ఊపిరితీత్తులు, గొంతులో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. కారణం లేకుండా బరువు తగ్గితే.. తప్పకుండా దాన్ని క్యాన్సర్ లక్షణంగా భావించాలి. బ్లడ్ క్యాన్సర్ వల్ల బాధితుడి ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం స్రవిస్తుంది.
అందుబాటులో ఆధునిక చికిత్స..
పూర్వం క్యాన్సర్ కేసులు అరుదుగా వచ్చేవి. వచ్చినా దానిని గుర్తించడం కష్టంగా ఉండేది. చికిత్స అందేలోపే రోగి మరణించేవాడు. ప్రస్తుతం ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. చిన్న చిన్న నగరాల్లోనూ చికిత్స అందిస్తున్నారు. ఆయుర్వేద కేంద్రాల్లోనూ క్యాన్సర్‌కు చికిత్స చేస్తున్నారు. వ్యాధిని గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నయం కూడా చేస్తున్నారు.