Mahila Commission : వైసీపీ జేబు సంస్థగా మహిళా కమిషన్.. పవన్ తప్ప వేరే ధ్యాసలేదా?
నిష్ఫక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నా.. అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. బాధితులు, బాధించబడ్డ వారు స్థితులను చూసి స్పందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విషయంలో ఒకలా.. పాలక పక్షం విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు.

Mahila Commission : ఏపీలో మహిళలపై దాష్టీకాలు పెరుగుతున్నాయి. వాటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.దిశ చట్టం ఆమోదం పొందిందని.. ఇకపై మహిళలపై కన్నెత్తి చూస్తే 21 రోజుల్లో ఉరిశిక్ష తప్పదని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. కానీ వందల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నా.. ఒకరికి కూడా శిక్ష పడిన దాఖలాలు లేవు. ప్రతీరోజూ ఏదోచోట లైంగిక వేధింపుల ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. తాజాగా విశాఖలో పదో తరగతి చదువుతున్న ఓ నేవీ అధికారి కుమార్తె కూతురు గ్యాంగ్ రేపునకు గురైంది. సీఎం జగన్ ప్రకటించినట్టు దిశ అమలు జరుగుతుందా అంటే.. సమాధానమే కరువవుతోంది.
పోనీ మహిళా కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుందా? అంటే అదీ లేదు.అదో ఉత్సవ విగ్రహంలా మారిపోయింది. అందులో రాజకీయ జోక్యం అధికమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ జేబు సంస్థగా మిగిలిందన్న అపవాదు మూటగట్టుకుంది. తాజాగా పవన్ రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యలు చేయగా ఏకంగా నోటీసులే జారీచేసింది. ఒంటరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వలంటీర్ల మనోభావాలను దెబ్బతీశారని కారణం చూపుతూ నోటీసులు జారీచేసినట్టు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. అసలు పవన్ ఏం వ్యాఖ్యానించారు? ఏ సందర్భంలో చేశారు? ఎందుకు చేశారు? అని ఆరాతీయకుండా నోటీసులు జారీచేయడం విశేషం.
గతంలో తనపై మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. భరణం ఇచ్చి.. వారి సమ్మతంతోనే వివాహాలు చేసుకున్నానని.. మీలా ఇంట్లో భార్య ఉండగా వీధికో స్టెప్నీతో గడిపే వ్యక్తిని కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో స్టెప్నీ అనే పదాన్ని వాడినందుకు, మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చని రెచ్చగొట్టినందుకు నోటీసులిచ్చారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా.. బూతు పదాలు వాడిన మహిళా కమిషన్ కు మాత్రం కమ్మని నీతి వ్యాఖ్యలుగా వినిపించడం విశేషం. వైసీపీ నేతల వ్యవహార శైలి, వాడే భాష అందరికీ తెలిసిందే. ఈ లెక్కనైతే ఏకంగా ఎంతమందికి నోటీసులందించాలో వాసిరెడ్డి పద్మకే ఎరుక.
సీఎం కార్యాయానికి కూతవేటు దూరంలో కృష్ణానది ఇసుక తెన్నెలపై కాబోయే భర్తతో సేదదీరుతున్న ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేశారు. కానీ నిందితులను పట్టుకోవడంలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మైనర్లపై దారుణమైన ఘాతుకాలు జరుగుతున్నాయి. కామాంధులు చిన్నారులపై తెగబడుతున్నారు. ప్రేమపేరిట అఘాయిత్యాలు, గృహహింసలు వెలుగుచూస్తున్నాయి. కానీ మహిళా కమిషన్ ఎక్కడా స్వాంతన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. మొన్నటికి మొన్న తన అక్కను వేధిస్తున్నారెందుకు అని ప్రశ్నించినందున ఓ వైసీపీ నాయకుడు బాలుడిపై యాసిడ్ పోసి చంపేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.కానీ ఎక్కడా మహిళా కమిషన్ స్పందించిన దాఖలాలు లేవు.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన వాసిరెడ్డి పద్మకు సీఎం జగన్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పదవి కల్పించారు.అయితే ఇది నామినేటెడ్ పదవే అయినా..స్వాతంత్ర్యంగా వ్యవహరించాల్సి ఉంది. మహిళా రక్షణలో కమిషన్ దే కీలక పాత్ర. కానీ ఇదో రాజకీయ కొలువుగా మారిపోయింది. నిష్ఫక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నా.. అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. బాధితులు, బాధించబడ్డ వారు స్థితులను చూసి స్పందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విషయంలో ఒకలా.. పాలక పక్షం విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు.
