Huzurabad ByPoll:హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది పార్టీల్లో టెన్షన్ పట్టుకుంది. గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నా విజయం సాధిస్తామో లేదో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నా ఎక్కడో ఒక మూలకు అనుమానమనే బీజం కలవరం సృష్టిస్తోంది. గెలిస్తే ఓకే కానీ ఓటమి పాలయితే మాత్రం అవమానం తట్టుకోలేమనే స్థాయికి రెండు పార్టీల నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలో విజయం కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. ప్రత్యర్థి పార్టీపై విమర్శల దాడితో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని తాపత్రయ పడుతన్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ ధరల పెరుగుదలను ఆయుధంగా చేసుకుని నిత్యం ప్రచారం నిర్వహిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా కేసీఆర్ పాలనపై తమదైన శైలిలో విమర్శలు సంధిస్తూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో రాజకీయ వేడి రగులుకుంది. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో వారినే తమ ప్రచారానికి తీసుకెళ్లడానికి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. వారితోనే ప్రచారం చేయించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ గ్యాస్ బండను ముందు పెట్టి ఓట్లు అడుగుతోంది.
బీజేపీ కూడా అదే తీరుగా ఈటల రాజేందర్ సతీమణి జమునను ముందు నిలిపి ఆమె ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గంలో 1,17,779 మంది పురుష ఓటర్లుండగా 1,19,093 మంది మహిళా ఓటర్లున్నారు. దీంతో వారే గెలుపు నిర్ణేతలుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే వారికి పెద్దపీట వేస్తున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికను అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. టీఆర్ఎస్ మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అక్కడే తిష్టవేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సానుభూతి ఓట్లతో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఆయుధాలు వాడుతున్నట్లు తెలుస్తోంది.