
Ravi Shastri- Mohammed Shami
Ravi Shastri- Mohammed Shami: టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మైదానంలో ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. వారికి స్ఫూర్తినిచ్చేలా బలమైన పదాలను ప్రయోగిస్తాడని.. ప్రేరణ కల్పించడంలో ప్రసిద్ధి చెందాడని చెబుతుంటారు. జట్టు కోసం వారి 100% రాబట్టడంలో రవిశాస్త్రిని మించిన వారు లేరంటారు. మాజీ టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తాజాగా రవిశాస్త్రి బలమైన మాటలు మహమ్మద్ షమీని మ్యాచ్-విజేత స్పెల్ బౌలింగ్ చేయడానికి ప్రేరేపించాయనే దానిపై ఓ సీక్రెట్ ను బయటపెట్టాడు.
2018లో దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా-ఇండియా మధ్య చారిత్రాత్మకమైన మూడు మ్యాచ్‌ల సిరీస్ అత్యంత హోరాహోరీగా సాగింది.. అద్భుతమైన ఆటతీరును కనబరిచినప్పటికీ, సౌతాఫ్రికా 2-0తో ఆధిక్యంలోకి వచ్చింది. టీమ్ ఇండియా మొదటి రెండు టెస్టుల్లో ఓడిపోయింది. ఓటమి గెలుపునకు నాంది అన్నట్టు… తర్వాత జరిగిన మూడో టెస్టులో భారత్ గెలిచింది. ఈ విజయం వెనుక అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మ్యాచ్ మధ్యలో లంచ్ సమయం అది. టీమిండియా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. లంచ్ వేళ టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ మటన్ రైస్ తింటున్నాడు. అదే సమయంలో రవిశాస్త్రి అక్కడికి వచ్చాడు.. ‘మీరు ఆకలి తీర్చుకుంటున్నారు.. మైదానంలో ఓడిపోయి ఆకలితో వస్తున్నారు” అని షమీ మటన్ రైస్ తినడాన్ని చూస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్లేట్ లాగేసుకున్నాడు. మరి ఈ వ్యాఖ్యలు షమిలో స్ఫూర్తినింపాయో? లేక పట్టుదల పెంచాయో తెలియదు గానీ.. మొత్తానికి షమీని రెచ్చిపోయేలా చేశాయి. ఆ తర్వాత 5 వికెట్లు తీసిన షమీ సౌతాఫ్రికా నడ్డి విరిచాడు. ఇండియా టీంను దక్షిణాఫ్రికా మీద గెలిపించాడు. ఈ విలక్షణమైన టెస్ట్ మ్యాచ్ విజయానికి సంబంధించి మాజీ ఫీల్డింగ్ ఆర్ శ్రీధర్ ‘బియాండ్ మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీం’ అనే పుస్తకంలో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అది 2018. దక్షిణాఫ్రికాలో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత జట్టు కోహ్లీ నాయకత్వంలో బయలుదేరింది.. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా మైదానాలు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తాయి. అంతేకాదు ఈ దేశంలో భారత ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగోలేదు.. ఈ మైదానాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాదిరే ఉంటాయి. సౌతాఫ్రికాలో ఓటమిని మార్చేందుకు కోహ్లీ, అప్పటి కోచ్ రవిశాస్త్రి రకరకాల ప్రయత్నాలు చేశారు.. ఈ దక్షిణాఫ్రికా పర్యటన భారత టెస్ట్ క్రికెట్ పురోగమనానికి నాంది పలికింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సిరీస్ విజయం దక్కకపోయినప్పటికీ భారత జట్టు అనేక గుణపాఠాలు నేర్చుకున్నది..

Ravi Shastri- Mohammed Shami
ఈ టోర్నీలో భారత జట్టు భువనేశ్వర్ కుమార్, బుమ్రా, షమీ వంటి బౌలర్లను తన తురుపు ముక్కలుగా ఉపయోగించింది. అయితే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లను దక్షిణాఫ్రికా గెలిచింది.. డివిలియర్స్, క్వింటన్ డీకాక్, ఫాప్ డు ప్లేసిస్ వంటి వారు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. వెర్నాన్, ఫిలాండర్, రబాడా బౌలింగ్లో భారత బ్యాట్స్ మన్ తడబడ్డారు. ఆ రెండు టెస్టులు నేర్పిన గుణపాఠమో తెలియదు కానీ… మూడో టెస్ట్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
జోహన్నెస్ బర్గ్ లో జరిగిన మూడు టెస్టులో భారత్ గెలిచింది. మొదట ఇండియా బ్యాటింగ్ చేసింది.. తర్వాత పిచ్ కఠినంగా మారింది.. షమీ మొదటి ఇన్నింగ్స్ లో 12 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చాడు.. ఆ సమయానికి దక్షిణాఫ్రికా విజయానికి 241 పరుగులు అవసరం. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 136/3 వద్ద ఉంది. అప్పటికి ఎల్గార్, ఆమ్లా 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ బ్రేక్ కోసం వచ్చిన షమీ నిరాసక్తతతో కనిపించాడు. మళ్లీ భోజనం కోసం వచ్చినప్పుడు అతడు తన ప్లేట్లో అన్నం, మటన్ కర్రీ కలిపి తింటుండగా… కోచ్ రవి శాస్త్రి విరుచుకుపడ్డాడు.” బ్లడీ హెల్.. మీరు ఇక్కడే మీ ఆకలి తీర్చుకుంటారా? లేదా వికెట్ల కోసం కొంతైనా ఆదా చేస్తారా” అని అరిచాడు. దీంతో షమీ ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకున్నాడు. అతడితోపాటు ఇండియన్ బౌలర్లు దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు.. నాడు రవి శాస్త్రి అన్న మాటలు ఇండియా టెస్ట్ క్రికెట్ గతిని మార్చాయని శ్రీధర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. అన్నట్టు చివరి ఇన్నింగ్స్ లో షమీ ఐదు వికెట్లు తీయడంతో భారత్ విజయతీరాలకు చేరింది. భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ పురస్కారం దక్కించుకున్నాడు. అంతకుముందు కే ప్ టౌన్ లో జరిగిన మొదటి టెస్ట్ లో 208 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోలేక భారత్ ఓడిపోయింది. రెండో టెస్ట్ లోనూ ఓటమే ఎదురయింది. కానీ రవి శాస్త్రి అన్న మాటలు భారత బౌలర్లు, ముఖ్యంగా షమీ లో కసి పెంచాయి. సౌతాఫ్రికా మీద గెలిచేలా చేశాయి. టెస్ట్ క్రికెట్ పురోగమనానికి తోడ్పాటు అందించాయి.