Karnataka : అలా కాంగ్రెస్ గద్దెనెక్కిందో లేదో.. కర్ణాటక ప్రజలకు ఇలా షాకిచ్చారు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62 వేల కోట్ల ఖర్చవుతుందని ఎకనామిక్ టైమ్స్ అంచనా వేసింది.

Karnataka : కర్ణాటకలో కొత్త సర్కార్ కొలువుదీరి వారం రోజులు కూడా కకముందే పాలక పక్షం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనే కారణం. ఐదు ప్రధాన హామీలు నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ కూడా అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేసింది.
ఐదు హామీలతో అధికారంలోకి..
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధానంగా ఐదు హామీలు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడా హామీలే కాంగ్రెస్ కు ఇరకాటంగా మారాయి. ఏ రాష్ట్రంలో అయినా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఓ సంవత్సరం వరకు సాఫీగానే ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా నూతన ప్రభుత్వం పట్ల కొన్ని నెలల పాటు ఓపిక వహిస్తాయి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసే వరకు వేచి చూస్తాయి. కానీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించే పరిస్థితే లేకుండా పోయింది. ప్రజలే మెడ మీద కత్తిపెట్టినట్టే ఐదు హామీల అమలుపై చాలా చోట్ల నిలదీస్తున్నారు.
కరెంటు బిల్ల కట్టం.. టికెట్ తీసుకోం..
ఐదు హామీల్లో ఒకటి ఉచిత కరెంటు.. రెండోది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ రెండు తక్షణం అములు చేయాలని కర్ణాటక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరెంటు బిల్లు వసూలుకు వచ్చిన అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోబోమని మహిళలు మొండికేస్తున్నారు. దీంతో అధికారులు తలలు పట్టుకుటున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పినా వినిపించుకోవడం లేదు. హామీ ఇచ్చారు.. అమలు చేయాల్సిందే అని పట్టుపడుతున్నారు. ఇప్పుడు ప్రజా గొంతుకలకు విపక్ష బీజేపీ తోడైంది.
ఆ హామీల అమలుకు రూ.62 వేల కోట్లు..?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీలను అమలు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి రూ.62 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇది ఆ రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 20 శాతంతో సమానమని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఉచిత హామీలు ఇవీ..
– రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటుతోపాటు మహిళలకు నెలకు రూ.2 వేలు, బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు కీలకమైనవి. మత్స్యకారులకు ఉచితంగా 500 లీటర్ల డీజిల్ వంటివి వీటికి అదనం. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62 వేల కోట్ల ఖర్చవుతుందని ఎకనామిక్ టైమ్స్ అంచనా వేసింది.
అమలు కష్టం కాకపోయినా..
ఇచ్చిన హామీలను నెరవేర్చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని తెలుస్తోంది. అయినా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీతోపాటు మొత్తంగా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇది కూడా అమలు చేస్తే మాత్రం రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
