Rishabh Pant : రిషబ్ పంత్ వరల్డ్ కప్ ఆడేనా..! ఫిట్నెస్ టెస్ట్ పాసయ్యేనా..?
వరల్డ్ కప్ ఆడాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు రిషబ్ పంత్ తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. ఆ శ్రమకు అనుగుణమైన ఫలితం దక్కితే మాత్రం వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్ పేరు ఉండడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.

Rishabh Pant : టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వరల్డ్ కప్ లక్ష్యంగా సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత పంత్ కు పలు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఈ శస్త్ర చికిత్సల అనంతరం స్వల్పంగా కోలుకున్న పంత్.. నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి మరింత వేగంగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న వరల్డ్ కప్ లో ఆడడమే లక్ష్యంగా పంత్ అడుగులు వేస్తున్నాడు. అయితే, వరల్డ్ కప్ లో ఆడాలన్న పంత్ ఆకాంక్ష అంత సులభంగా నెరవేరేలా కనిపించడం లేదు.
భారత జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగాడు యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్. అయితే, గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత పూర్తిగా క్రికెట్ కు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ వరల్డ్ కప్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో కసరత్తులు చేస్తున్న ఫోటోలు కొద్దిరోజుల కిందట పంత్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. వీలైనంత వేగంగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ కామెంట్ కూడా చేశాడు. పంత్ కసరత్తులు వరల్డ్ కప్ కోసమే అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వేగంగా కోలుకుని వరల్డ్ కప్ లో పంత్ ఆడాలి అంటూ కోరుకున్నారు. ఆ దిశగానే తీవ్ర కసరత్తులు చేస్తున్న పంత్ కోరిక నెరవేరాలని పలువురు కామెంట్లు చేశారు.
కోలుకున్నా ఫిట్నెస్ టెస్ట్ నెగ్గడం కష్టమే..
ఆసుపత్రి నుంచి కొద్ది నెలల కిందటే డిశ్చార్జ్ అయిన పంత్.. వీలైనంత త్వరగా భారత జట్టుతో చేరేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. మొదట్లో ఇంటి వద్ద ఉంటూనే ఫిట్నెస్ కు సంబంధించిన కార్యక్రమాలు చేసిన పంత్.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో నిపుణుల పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించేందుకు అనుగుణంగా కసరత్తులు చేస్తున్నాడు. అయితే, ఇప్పటికీ పంత్ కొంత ఇబ్బంది పడుతూనే ఫిట్నెస్ సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం చిన్న చిన్న కస్తరత్తులు చేసేందుకు ఇబ్బంది పడని పంత్.. మున్ముందు కఠినమైన టెస్టులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే పలు ఫిట్నెస్ పరీక్షలు పాస్ కావాలి. ముఖ్యంగా యోయో టెస్ట్ కఠినంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రమాదం నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్.. ఈ ఫిట్నెస్ పరీక్షలు పాస్ కావడం కొంత కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పంత్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన టెస్టులకు సిద్ధపడినా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది నిపుణుల మాట. అయితే వరల్డ్ కప్ ఆడాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు రిషబ్ పంత్ తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. ఆ శ్రమకు అనుగుణమైన ఫలితం దక్కితే మాత్రం వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్ పేరు ఉండడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.
