Modi- Jagan: దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్యమన్నట్టుంది ఏపీలో ఎల్లో మీడియా వ్యవహార శైలి. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఈ సెక్షన్ ఆఫ్ మీడియాకు చేతినిండా పనే. కథనాలు సృష్టించి మరీ రాయడం, చూపడం చేస్తుంటాయి. ప్రస్తుతం వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ పట్టుబిగిస్తున్నతరుణంలో సీఎం జగన్ ఎవర్ని కలిసినా కేసు నుంచి బయటపడేందుకేనని చూపించడానికి తెగ ఆరాటపడుతున్నాయి. సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా జగన్ ఈ కేసు విషయంలో కేంద్ర పెద్దలను కలుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయినా కేసు విచారణ ఆగలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలి.

Modi- Jagan
గతంలో కూడా చంద్రబాబు తరచూ ఢిల్లీ పెద్దలను కలిసేవారు. అప్పట్లో ఎల్లో మీడియా విభజన హామీలకేనంటూ కథనాలు వండి వార్చేది. చంద్రబాబు ఇన్నిసార్లు కలిశారు. ప్రత్యేక హోదా అడిగారు. పోలవరానికి నిధులు కోసం డిమాండ్ చేశారు అని మొదట్లో ప్రచారం చేశారు. చివరిలో మాత్రం వైసీపీ ట్రాప్ లో పడి కేంద్రాన్ని దూరం చేసుకున్నప్పుడు మాత్రం గుజరాత్ కంటే ఏపీ అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్న ఆందోళనతో మోదీ సహకరించడం లేదని ప్రచారం మొదలుపెట్టారు. నాటి ఎల్లో మీడియా బాధ్యతను ఇప్పుడు నీలి మీడియా తీసుకుంది. జగన్ ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాలకేనన్నట్టు చూపుతోంది. ప్రత్యేక హోదా అడుగుతున్నట్టు పాత మాటనే చెబుతూ వస్తోంది. ఇంకా కేంద్రంతో గ్యాప్ రానందు వల్ల చంద్రబాబు మాదిరిగా వ్యతిరేక కామెంట్స్, కథనాలు మాత్రం కనిపించడం లేదు.

Modi- Jagan
వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని బయటపడేసేందుకు జగన్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా కేంద్ర పెద్దలను తరచూ కలుస్తున్నట్టు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రధాని మోదీ అభయమిచ్చినట్టు అనుమానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్యన సీబీఐ దర్యాప్తు మందగించింది. కానీ ఇటీవల చురుగ్గా జరుగుతోంది. వివేకా కుమార్తె వినతి మేరకు కేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. అటు అనుమానితులను ఒక్కొక్కరికి నోటీసులిచ్చి విచారణ చేస్తున్నారు. సీఎం జగన్ మేనేజ్ చేసి ఉంటే ఇవన్నీ ముందుకు సాగవన్నది ప్రశ్న. ఒక వేళ మోదీ అభయం ఇచ్చుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ముందడుగు వేయలేని పరిస్థితి. కానీ ఇవేవీ పట్టించుకోని ఎల్లో మీడియా పనిగట్టుకొని వివేకానందరెడ్డి హత్య కేసుపై రకరకాల ప్రచారం మొదలుపెట్టింది. తమకు రాజకీయమే తప్ప మరే ఇతర అంశాలు కనిపించవన్న రేంజ్ లో ప్రవర్తిస్తున్నాయి.