Pawan Kalyan- Kapu Community: ఏపీలో కుల రాజకీయాలు అధికం. ఎన్నికల్లో సామాజిక సమీకరణలే కీలకం. కానీ ఎక్కువ జనాభా ఉన్న కులాలకు మాత్రం ‘కీ’లక ప్రాతినిధ్యం దక్కడం లేదు. అటు అణగారిన వర్గాల వారు సైతం లెక్కల గణాంకాలకే పరిమితమవుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాలతో సరిపుచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఆపై మంత్రుల వరకూ పదవులు దక్కించుకుంటున్నారు. ఆపైకి మాత్రం చూడలేకపోతున్నారు. నాలుగైదు శాతం ఉన్న కులాల వారు మాత్రం సుదీర్ఘ కాలం రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. ఇప్పటికీ అనుభవిస్తునే ఉన్నారు. ఏపీ సమాజంలో ఎక్కువగా నష్టపోయిన సామాజికవర్గాలు ఏవంటే అది ముమ్మాటికీ కాపులు, ఇతర అణగారినవర్గాలు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఏపీచరిత్రను తీసుకున్నా.. అవశేష ఏపీ పరిస్థితిని చూసినా ఒక్కరంటే ఒక్క కాపు సామాజికవర్గం సీఎం లేరంటే ..ఆ సామాజికవర్గం ఎంతలా అణగదొక్కబడిందో అర్ధం చేసుకోవచ్చు.

Pawan Kalyan
ఉమ్మడి ఏపీలో కానీ.. ఇప్పుడు విభజిత ఏపీలోకాని జనాభాపరంగా కాపులు అధికం. దాదాపు 27 నుంచి 32 శాతంతో వారిదే సింహభాగం. అదే రెడ్డి సామాజికవర్గాన్ని తీసుకుంటే ఆరు శాతం, కమ్మ వర్గాన్ని తీసుకుంటే 5 శాతం మాత్రమే ఉన్నారు.కానీ ఫుల్ డామినేషన్ మాత్రం ఆ రెండు సామాజికవర్గాలదే. జనాభాపరంగా ఉన్న అధికంగా కాపుల్లో ఐక్యత లేకపోవడం ఒక కారణమైతే… ఆ అనైక్యతకు మాత్రం మూలకారకులు ఆ రెండు సామాజికవర్గాల నేతలే. వారి రాజకీయాలకు సమిధులుగా మారుతున్న బాధితులు కాపులు. అయితే కాపులకు అన్యాయం చేయడంలో అన్ని పార్టీల పాత్ర ఉంది. సుదీర్ఘ కాలం దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీలో కాపులకు చాన్స్ వచ్చినట్టే వచ్చి తప్పిపోయేది. రెడ్డి సామాజికవర్గం ప్రభ ముందు కాపుల ఆశలు నీరుగారిపోయేవి. ఎన్నికల షీల్డ్ కవర్లలో కాపుల పేర్లు కనుమరుగయ్యేవి. అయితే వంగవీటి మోహన్ రంగా రూపంలో అరుదైన అవకాశం వచ్చినట్టే వచ్చి.. ఆయన అకాల మరణంతో నీరుగారి పోయింది.
అటు తరువాత చిరంజీవి రూపంలో పురుడుబోసుకున్న ప్రజారాజ్యం పార్టీ సైతం రాజకీయ కుట్రలకు సమిధగా మారిపోయింది. అది మా పార్టీ అని కాపులు సొంతం చేసుకోలేదు.అటు పీఆర్పీ నాయకత్వం సైతం కాపులను ఓన్ చేసుకోవడంలో సక్సెస్ కాలేదు. రాజకీయ కుట్రలు, కుతంత్రాల్లో ఆరితేరిన మిగతా సామాజికవర్గాల కుట్రకు పీఆర్పీ బలైంది. కాంగ్రెస్ లో విలీనం అవ్వక తప్పని అనివార్య పరిస్థితులు కల్పించడంతో కనుమరుగైంది. అయితే ఈ పరిణామ క్రమంలో గమనిస్తే మాత్రం కుట్రలకు ప్రతినిధులుగా పనిచేసిన వారు కాపు సామాజికవర్గం నాయకులే. పాత్రలు, పాత్రదారులు కూడా వారే. వెనక ఉండి నడిపించింది మాత్రం ముమ్మాటికీ ఆ రెండు సామాజికవర్గాలే.

Pawan Kalyan
అయితే కాలం ఎప్పడూ ఒకేలా ఉండదు కదా. అందుకే జనసేన రూపంలో ఇప్పుడు మరో ఆప్షన్ కాపులు ముందుంది. గత అనుభవాల దృష్ట్యా మేల్కొంటారో.. లేక ఆ రెండు సామాజికవర్గాల కుట్రలకు మరోసారి బలవుతారో అన్నది ఏపీ సమాజంలోని కాపు వర్గాలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే జనసేనను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన కుట్రలను పవన్ భగ్నం చేశారు. గట్టి పోరాటమే చేసి నిలబడ్డారు. ధైర్యంగా పోరాడగలుగుతున్నారు. ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని పెంచుకోగలిగారు. ఇక తేల్చుకోవాల్సింది కాపు సామాజికవర్గం ప్రజలే. సమాజాన్ని చికిత్స చేసే పనిలో ఉన్నపవన్ నేరుగా కులాన్ని అర్ధించలేని పరిస్థితి. అది గుర్తెరిగి మసులుకోవాల్సిన గురుతుర బాధ్యత కాపులపై ఉంది. తమకు అలవాటైన కుట్రలకు బలవుతారో.. లేకుంటే మేల్కొని పవన్ కు అండగా నిలుస్తారో చూడాలి మరీ.